Jul 18,2023 21:30

ధర్నా చేస్తున్న ఆశా వర్కర్లు

ప్రజాశక్తి - బెలగాం : ఉదయం నుంచీ బోరున వర్షం పడుతున్నా లెక్క చేయకుండా సమస్యల పరిష్కారం కోసం ఆశా వర్కర్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి కథం తొక్కారు. వర్షం పడుతున్నా గొడుగులు వేసుకొని జిల్లా నలుమూలల నుంచి ఆశా వర్కర్లు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. మంగళవారం నిర్వహించిన ఈ ధర్నానుద్దేశించి శ్రామిక మహిళా సంఘం జిల్లా నాయకులు వి.ఇందిర మాట్లాడుతూ ఆశా వర్కర్లతో సంబంధం లేని పనులు చేయించకూడదు, నాణ్యమైన సెల్‌ఫోన్‌ 4 జి సిమ్‌ ఇవ్వాలని, ఆన్‌లైన్‌ పనులు చేసేందుకు శిక్షణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం సెలవులు ఇవ్వాలి, మెడికల్‌ లీవు, గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించాలని, ఎఎన్‌ఎం, ఎఎల్‌హెచ్‌పిల ఒత్తిడి ఆపాలని కోరారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6,7గంటల వరకు సబ్‌ సెంటర్లో ఉంటూ ఇతర 14 రకాల యాప్‌లను డౌన్లోడ్‌ చేసుకుని వాటి నుంచి పని చేయాలని 26 రికార్డులు రాయాలని ప్రభుత్వం దుర్మార్గంగా ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. రికార్డ్‌లు సొంత డబ్బులు పెట్టి కొనాలని, సంబంధం లేని ఆన్లైన్‌ పనులు సొంత ఫోన్ల ద్వారా చేయాలని వేధిస్తున్నార న్నారు. సెలవుల్లేకపోవడంతో అనారోగ్యాల పాలవు తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆన్లైన్‌ వర్క్‌ భారాన్ని తగ్గించాలని, ఆన్లైన్లో లేదా రికార్డు ఒక పని ఒక్కసారి మాత్రమే చేసేలా చూడాలని, రూ.10 లక్షలు గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ ఇవ్వాలని, రిజిస్టర్లు సంతకాలు చేయించడం ఆపాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి జగన్నాధ రావుకు వినతిని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు యూనియన్‌ నాయకులు ఎ.మాలతి, గౌరి, అప్పలనరసమ్మ, గంగాభవానీ, కామాక్షి, పద్మ, శ్రీకన్య, అన్నపూర్ణమ్మ సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, కోశాధికారులు దావాల రమణారావు, వై.మన్మధరావు, గొర్రెల వెంకట రమణ, పలువురు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.