ప్రజాశక్తి-రాంబిల్లి
ఎస్‌ఈజెడ్‌లోని హైటెక్ కంపెనీలో కార్మికులకు జీతాలు పెంచాలని, కార్మిక చట్టాలను అమలు చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం పరిశ్రమ ప్రధాన ద్వారం వద్ద కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు కె.సోమునాయుడు మాట్లాడుతూ హైటెక్ కంపెనీలో కార్మిక చట్టాలు అమలు చేయడం లేదని, కార్మికులను కట్టు బానిసులుగా చూస్తూ వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారని తెలిపారు. అదే సందర్భంలో కనీస వేతనాలు అమలు చేయడం లేదని, బోనస్‌లు, ఈఎస్‌ఐ, పిఎఫ్, క్యాంటీన్ తదితర సమస్యలను పరిష్కరించే వరకు ధర్నా కొనసాగుతుందని స్పష్టం చేశారు. అనంతరం పరిశ్రమ హెచ్‌ఆర్ ఇన్‌ఛార్జికి 12 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. రాంబిల్లి ఎస్‌ఐ ఆధ్వర్యాన పూడి సర్పంచ్ లాలం వాణి వాసు, ఉప సర్పంచ్ ఎస్.తాతారావు, సిఐటియు జిల్లా నాయకులు కె.సోమునాయుడు, సిహెచ్.తాతయ్య, స్థానిక నాయకులు ఆర్.సంజీవ్, ఎల్.సురేష్, ఆర్.రాజు, ఎస్.రాజు హెచ్‌ఆర్ ఇన్‌ఛార్జితో చర్చలు జరిపారు. ఈ డిమాండ్లపై యాజమాన్యంతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తామని, ఈ నెల 27వ తేదీ వరకు సమయం కావాలని హెచ్‌ఆర్ ఇన్‌ఛార్జి కోరారు. దీంతో కార్మికులను ధర్నాను విరమించి విధులకు హాజరయ్యారు.










