Jul 18,2023 21:23

కలెక్టరేట్‌ వద్ద భారీ ధర్నా
పనిభారం తగ్గించాలని డిమాండ్‌
వృత్తికి సంబంధం లేని పనులు చేయిస్తున్నారంటూ ఆగ్రహం
వర్షంలోనూ కొనసాగిన ఆందోళన
ప్రజాశక్తి - ఏలూరు అర్బన్‌

ఆశా వర్కర్లతో సంబంధం లేని పనులు చేయించరాదని, పని భారం తగ్గించాలని గ్రూప్‌ బీమా సౌకర్యం కల్పించాలని, అధికారుల వేధింపులు ఆపాలని కోరుతూ ఏలూరులోని కలెక్టరేట్‌ వద్ద ఆశాలు మంగళవారం పెద్దఎత్తున ధర్నా చేపట్టారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా, అధికారుల బెదిరింపులకు వెరకుండా వందలాది మంది ఆశా కార్యకర్తలు ఈ ధర్నాకు తరలివచ్చారు. ఈ ధర్నానుద్దేశించి ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా గౌరవ అధ్యక్షులు ఆర్‌.లింగరాజు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్‌విడి.ప్రసాద్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రూ.పది వేలు ఇస్తుందనే పేరుతో 14 రకాల యాప్‌లు, 26 రిజిస్టర్లు నిర్వహించాలంటూ పనిభారం మోపిందని విమర్శించారు. ఆశా వర్కర్లకు నాణ్యతలేని సెల్‌ఫోన్లు, 2జి సిమ్‌కార్డులిచ్చి ఆన్‌లైన్‌ వర్క్‌ చేయాలంటే ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఉన్నతాధికారులు చేతివాటం ప్రదర్శించి నాణ్యతలేని ఫోన్‌ ఇచ్చి ఆశాలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. నెలకు నాలుగైదు సమావేశాల పేరుతో పిహెచ్‌సిలకు పిలిపించి టిఎ, డిఎలు ఇవ్వకుండా ఆశా వర్కర్లను ఆర్థికంగా నష్టపరుస్తున్నారని విమర్శించారు. ఉదయం నుండి సాయంత్రం వరకూ సచివాలయం వద్ద ఉండాలని స్థానిక అధికారులు ఒత్తిడి చేయడం, బానిసలుగా పనిచేయించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆశ వర్కర్ల జాబ్‌తో సంబంధం లేని పనులు చెబితే తిరస్కరిస్తామన్నారు. యూనియన్‌ జిల్లా నాయకురాలు కమల మాట్లాడుతూ ఆశా వర్కర్లకు పని భారం పెరిగి బిపి, షుగర్‌, గుండె జబ్బులు వచ్చి తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అకాల మరణం చెందినా, ప్రమాదవశాత్తు మరణించినా రూపాయి కూడా పరిహారం ఇవ్వకుండా ఆశాలను తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణం పని భారం తగ్గించాలని ఆమె డిమాండ్‌ చేశారు.
ఆశాల సమస్యలపై జిల్లా అధికారులు తక్షణం జాయింట్‌ మీటింగ్‌ ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి కషి చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం డిపిఒ జోషికి వినతిపత్రం అందజేశారు. డిపిఒ మాట్లాడుతూ తమ పరిధిలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లా మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఆఫీసర్‌తో మాట్లాడి జాయింట్‌ మీటింగ్‌ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. ధర్నా అనంతరం నినాదాలు చేస్తూ కలెక్టరేట్‌ నుండి ఫైర్‌ స్టేషన్‌ వరకూ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా నాయకులు రోజా, లోకేశ్వరి, కామేశ్వరి, కనకదుర్గ, మేరీ, పావని, పరమేశ్వరి, లలిత, అరుణ, విజయ, నాగమణి నాయకత్వం వహించారు. ఈ ధర్నాలో అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షురాలు కొర్రి విజయలక్ష్మి, మధ్యాహ్న భోజన పథకం కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎం.నాగమణి, సిఐటియు నగర అధ్యక్ష, కార్యదర్శులు బి.జగన్నాథం, వి.సాయిబాబు, ఆటో వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి జె.గోపి పాల్గొని మద్దతు తెలిపారు.