Oct 16,2022 23:30

ర్యాలీ నిర్వహిస్తున్న ఎండిఎం కార్మికులు

ప్రజాశక్తి -తగరపువలస : తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ఆదివారం స్థానికంగా ర్యాలీ, రిలే దీక్షలు చేపట్టారు. దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి సిఐటియు డివిజన్‌ నాయకులు రవ్వ నరసింగరావు మాట్లాడుతూ, పద్మనాభం మండలంలో మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయ పాత్రకు ఇవ్వాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. భీమిలి, ఆనందపురం మండలాల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణా బాధ్యతను అక్షయ పాత్ర నుంచి తొలగించి, మరలా కార్మికులతోనే నిర్వహించాలని, విలీన పాఠశాలల కార్మికులను తొలగించరాదని కోరారు. ఎపి మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్‌ (సిఐటియు) జిల్లా కార్యదర్శి జి మంగశ్రీ మాట్లాడుతూ, ఉద్యోగ భద్రత కల్పించాలని, ధరల పెరుగుదలకు అనుగుణంగా బడ్జెట్‌ కేటాయించాలని, అన్‌ స్కిల్డ్‌ వర్కర్లకు చెల్లించే విధంగా వేతనం ఇవ్వాలని, బిల్లులు, వేతనాలు ప్రతి నెలా 5వ తేదీ లోపు చెల్లించాలని కోరారు. ప్రమాద బీమా సదుపాయం కల్పించాలని, నూతన విద్యా విధానాన్ని రద్దుచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. డివైఎఫ్‌ఐ నాయకులు ఎస్‌.శ్రీనివాసవర్మ దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. యూనియన్‌ నాయకులు రవ్వ నరసింగరావు ముందుగా దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భీమిలి, ఆనందపురం, పద్మనాభం మండలాలకు చెందిన ఎండిఎం కార్మికులు, యూనియన్‌ నాయకులు డి.రాము, బి రాంభాయి, వెంకాయమ్మ, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.