Nov 01,2023 22:59

ప్రజాశక్తి - ఉండ్రాజవరం మండల సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులు పలు సమస్యలను లేవనెత్తారు. గ్రామాల్లో ప్రజలు అనేక సమస్యలతో సతమతమౌతున్నారని ఏకరువు పెట్టారు. ఎంపిపి పాలాటి యల్లారీశ్వరి అధ్యక్షతన మండల పరిషత్‌ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం బుధవారం జరిగింది. తొలుతగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మండలంలోని పలు గ్రామాలకు చెందిన ఎంపిటిసిలు, సర్పంచులు సమస్యల పరిష్కారంపై గళమెత్తారు. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు అధికారులను నిలదీశారు.కో ఆప్షన్‌ సభ్యులు షేక్‌ షాజహాన్‌ మాట్లాడుతూ విద్యుత్‌ వినియోగదారులకు భారం లేకుండా తప్పనిసరిగా నెల రోజులకు మాత్రమే రీడింగ్‌ తీయాలన్నారు. నెల రోజులు దాటిన తరువాత రీడింగ్‌ తీయడంతో స్లాబ్‌ మారిపోవడంతో వినియోగదారులపై అధిక భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తాడిపర్రు సర్పంచ్‌ కె.నరేంద్రబాబు మినీ గోశాలకు సంబంధించిన బకాయిల చెల్లింపులపై ప్రశ్నించారు. దీనిపై టెక్నికల్‌ అసిస్టెంట్‌ నాయక్‌ సమాధానం ఇస్తూ బిల్లులు చేయడం పూర్తయిందని, అతిత్వరలోనే నగదును ఆయా ఎకౌంట్లకు జమ చేస్తామన్నారు. తమ గ్రామానికి చెందిన లబ్ధిదారునికి అమ్మబడి రాలేదని పసలపూడి సర్పంచ్‌ కె.లక్ష్మి ఎంపిడిఒ దృష్టికి తెచ్చారు. డ్రైనేజీల్లో పూడిక తీయకపోవడం వల్ల నీటి ప్రవాహం జరగడం లేదని చివటం ఎంపిటిసి వివి.సత్యనారాయణ సమావేశం దృష్టికి తెచ్చారు. జడ్‌పిటిసి నందిగం భాస్కర రామయ్య మాట్లాడుతూ సర్పంచ్‌లు సర్వసభ్య సమావేశానికి అతిధులుగా హాజరవుతారని, ఏమైనా సమస్యలు ఉంటే ఎంపిటిసి దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. మండలానికి మంజూరు అయిన వివిధ గ్రాంట్లు వివరాలను ఆయన సభ దృష్టికి తీసుకొచ్చారు. ఎంపిడిఒ జివిఎస్‌ఆర్‌కె రాజు మాట్లాడుతూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.