ప్రజాశక్తి-సామర్లకోట రూరల్ ఎంఎల్‌ఎ నిమ్మకాయల చినరాజప్పకు ఎపి అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం వినతిపత్రం అందజేశారు. అచ్చంపేటలోని ఎంఎల్‌ఎ కార్యాలయంలో అంగన్‌వాడీల నాయకులు ఆయనను కలిసి సమస్యలపై వినతిపత్రం అందచేశారు. అంగన్‌వాడీల వేతనాలు పెంచాలని, గ్రాట్యూటీ అమలు చెయ్యాలని, ఐసిడిఎస్ పరిరక్షణ కోసం, అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత, కనీస వేతనం, పెన్షన్, పిఎఫ్, ఇఎస్‌ఐ, గ్రాట్యూటీ అమలు చెయ్యాలని శాసన సభలో చర్చించాలని కోరారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ప్రభుత్వ విధానాల వల్ల పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలను అనేక రెట్లు పెరిగాయని, కానీ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచలేదన్నారు. అంగన్ వాడీలకు తెలంగాణా కన్నా అదనంగా వేతనాలు పెంచుతానన్న ముఖ్య మంత్రి హామీ ఏళ్లు గడుస్తున్నా, అమలు చెయ్యడం లేదన్నారు. తెలంగాణాలో 2021 జూలై నెల నుండి వర్కర్లకు రూ.13,650, హెల్పర్స్, మినీ వర్కర్స్‌కు రూ.7,800 ఇస్తున్నారని, కాని మన రాష్ట్రంలో అంగన్‌వాడీలకు వేతనాలు పెంచలేదన్నారు. అందరికీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కూడా అమలు చెయ్యడం లేదని, సెంటర్ల నిర్వహణకు అంగన్‌వాడీలు పెట్టుబడులు పెట్టాల్సిన పరిస్థితిలో ఉన్నారని తెలిపారు. 2017 నుండి టిఎ బిల్లులు ఇవ్వడం లేదన్నారు. 2022 ఏప్రిల్ 25 అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అంగన్వాడీలకు గ్రాట్యూటి అమలు చెయ్యమని చెప్పిన తీర్పు ఇంత వరకు అమలులేదని తక్షణం వీటిని అమలు చేయాలని శాసన సభలో చర్చ జరపాలని విజ్ఞప్తి చేశారు. యూనియన్ నాయకులు టి.నాగమణి, ఎ.అమలావతి, టి.ఎల్.పద్మ, చంటమ్మ, మహాలక్ష్మీ, నాగమణి, సిఐటియు నాయకులు డి.క్రాంతి కుమార్ పాల్గొన్నారు.










