Mar 22,2023 00:13

ధర్నానుద్దేశించి మాట్లాడుతున్న మణి

ప్రజాశక్తి-కలెక్టరేట్‌, విశాఖ : సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యాన మంగళవారం విశాఖ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం ఎదుట ఆశ వర్కర్లు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్‌ విశాఖ జిల్లా గౌరవాధ్యక్షులు పి.మణి మాట్లాడుతూ, ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, పని భారం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో శిశు, మహిళల సంరక్షణకు వీరు చేస్తున్న సేవలను గుర్తించి పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌చేశారు. మహిళ శిశు సంరక్షణ కాని పనులను ఆశా వర్కర్లకు అప్పజెప్పవద్దని విజ్ఞప్తి చేశారు. ఆశ వర్కర్లకు జాబ్‌ చార్ట్‌ ఇవ్వాలని కోరారు. సచివాలయంలో ఉదయం 9 నుంచి 5 గంటల వరకు ఉంచవద్దని, సెంటర్స్‌ క్లీన్‌ చేయడం, ఓపి వర్క్‌ వంటి పనులు ఆశాలతో చేయించవద్దని కోరారు. ఆశా వర్కర్లే రికార్డులు కొన్కుక్కోవాల్సి రావడం దారుణం అన్నారు. ఆశా వర్కర్లకు నాణ్యమైన సెల్‌ఫోన్లు ఇవ్వకుండా ఆన్‌లైన్‌ వర్కు అప్పజెప్పవద్దన్నారు. వ్యాక్సిన్‌ బాక్సుల తరలింపు పని వీరితో చేయించడం భావ్యం కాదన్నారు. జీతాలకు సంబంధించిన కాగితాలను ప్రతినెలా డిఎం అండ్‌ హెచ్‌ఒ కార్యాలయానికి తీసుకొస్తూ రవాణా చార్జీలు భరిస్తున్నారని తెలిపారు. ఎన్నికలు, పరీక్షల సమయంలో విధుల్లో ఉన్న ఆశా వర్కర్లకు తాగునీరు, భోజనం, బస్సు ఛార్జీలు కల్పించాలని ఆదివారం డ్యూటీలు వేయవద్దని, 62 సంవత్సరాల రిటైర్మెంట్‌ జిఒని వర్తింపచెయ్యాలని, కోవిడ్‌ కాలంలో (2020 మార్చి నుంచి) మరణించిన ఆశాలకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్స్‌ను ఆశాలుగా మార్పుచేయాలని, నాణ్యమైన సెల్‌ ఫోన్లు, 4జి సిమ్‌ ఇవ్వాలని, ఎఎన్‌ఎం, హెల్త్‌ సెక్రటరీల నియామకాలలో ఆశాలకు వెయిటేజ్‌, గౌరవ వేతనం ఒకేసారి ఇవ్వాలని, ఆశ వర్కర్ల నియామకాలను ప్రభుత్వమే నిర్వహిచాలని, విధి నిర్వహణలో మరణిస్తే వారి కుటుంబాలకు నియామకాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌, సచివాలయాల డ్యూటీలు చేయించరాదని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా అధ్యక్షులు ఎస్‌.పద్మ, కార్యదర్శి వి.మేరీ, కోశాధికారి వై.సీతారత్నం తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారికి వినతి పత్రం సమర్పించారు.