ప్రజాశక్తి-అనకాపల్లి
ఆర్టీసీ కార్మికులకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించడంతోపాటు ఇతర డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం స్థానిక ఆర్టీసీ డిపో ముందు స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్‌డబ్ల్యుఎఫ్) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా డిపో అధ్యక్షులు బిఎ.రావు, కార్యదర్శి పరమేశ్వరరావు, నాయకులు త్రిమూర్తులు, సలోమి మాట్లాడుతూ మిగిలిపోయిన 2,096 మంది కార్మికుల పే ఫిక్సేషన్ జరగాలని, కొత్త బస్సులు కొనుగోలు చేయాలని, విద్యుత్ బస్సుల కోసం రాయితీలు ఆర్టీసీకే చెల్లించాలని, వైద్యాన్ని పునరుద్ధరించాలని కోరారు. మహిళా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, ఎస్సీ ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేయాలని, ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని, 12వ పిఆర్‌సి కమిషన్ నియమించి బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీరి నిరసనకు అద్దె బస్సు కార్మికులు సంఘీభావం తెలిపారు.










