ప్రజాశక్తి-యంత్రాంగం అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని పలువురు యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ చేపట్టిన జీపు జాతా జిల్లాలో పలు ప్రాంతాల్లో మంగళవారం పర్యటించింది. పిఠాపురం ఉప్పాడ బస్టాండ్ సెంటర్‌కు చేరుకున్న జాతాకు అంగన్వాడీలు స్వాగతం పలికారు. అనంతరం సభ నిర్వహించారు. ఈ సదర్భంగా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ చంద్రావతి, సిఐటియు జిల్లా నాయకులు కె.చిన్న ప్రాజెక్టు అధ్యక్షురాలు సిహెచ్.రమాప్రభ మాట్లాడారు. ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. అంగన్‌వాడీ వర్కర్ల ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలన్నారు. సమాన పనికి సమాన వేతనం కల్పించాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ సౌకర్యం రూ.ఐదు లక్షలు ఇవ్వాలని, బాలికా శిశు సంరక్షణ పథకాన్ని పటిష్ట పరచాలని, బడ్జెట్‌లో ఈ పథకానికి నిధులు కేటాయించాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, బకాయి వేతనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ నాయకులు ఎస్‌కె.పద్మ, ఎన్.శ్రీను, డి.తులసీదేవి, విజయశాంత, భవాని, నళిని, ప్రశాంతి, డి.బేబీ, ప్రజావాణి, నాగ గన్నిక పాల్గొన్నారు. పెద్దాపురంలో జాతాకు పెద్దాపురంలో అంగన్‌వాడీలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు దువ్వా శేష బాబ్జి, అంగన్‌వాడీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రావతి మాట్లాడారు. అంగన్వాడీల వేతనాలు పెంచుతానని సిఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని, కానీ నేటి వరకు ఆ హామీని నెరవేర్చలేదన్నారు. పని భారం మాత్రం అంగన్వాడీలపై అధికంగా మోపారన్నారు. యాప్‌ల పేరుతో అంగన్వాడీలపై పని ఒత్తిడి పెంచుతున్నారని విమర్శించారు. లబ్ధిదారులకు పౌష్టికాహారాన్ని కూడా సక్రమంగా ఇవ్వడం లేదన్నారు. జూలై 10న అంగన్వాడీల కోర్కెల దినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 48 గంటలపాటు కలెక్టరేట్ ఎదుట ధర్నాలు జరపాలని నిర్ణయించామన్నారు. ఈ కార్యక్రమంలో మేరీ సమాధానం, షేక్ పద్మ, మేరీ, సుజాత, శాంత, నక్కెళ్ళ శ్రీను, అమల, నాగమణి, టిఎల్.పద్మ, లిల్లీ, స్నేహలత, జాగారపు సూర్యకుమారి, రమణమ్మ, కాలే దేవి, సావిత్రి, సత్య, దేవి తదితరులు పాల్గొన్నారు. గొల్లప్రోలు బస్టాండ్ వద్ద జాతాలో యూనియన్ మండల నాయకులు సత్యవతి, సిఐటియు జిల్లా కమిటీ మెంబర్ కె.చిన్న, చంద్రావతి మాట్లాడారు. ఈ కార్యక్రమం పాల్గొన్న నాయకులు ఎస్‌కె.పద్మ, ఎన్.శ్రీను, రాఘవమ్మ, వెంకటలక్ష్మి, అమల, వెంకటలక్ష్మి, సూర్యకాంతం, రాణి పాల్గొన్నారు. యు.కొత్తపల్లి ఉప్పాడ రింగ్ రోడ్డులో జాతాలకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం కార్యదర్శి గుర్రాల అప్పారెడ్డి, మండల సిఐటియు అధ్యక్షులు కె.నాగేశ్వరరావు, లక్ష్మీ, మేరీ, శ్రీను, పద్మ, సత్యవతి పాల్గొన్నారు.










