ప్రజాశక్తి- కె.కోటపాడు
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యాన గురువారం తహశీల్దారు కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా నాయకులు జి.కుమారి మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, కేంద్రాల పరివేక్షణ పేరుతో వేధింపులు, కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని డిమాండ్ చేశారు. వైయస్సార్ సంపూర్ణ పోషక మెనూ ఛార్జీలు పెంచాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటి అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలని కోరారు. ర్యాలీలు, సభలు నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ వన్ వెంటనే రద్దు చేయాలన్నారు. అనంతరం డిప్యూటీ తహశీల్దారు రమేష్ బాబుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు పి.భవాని, దేవరాపల్లి, కె.కోటపాడు మండలాల అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.










