Nov 05,2023 20:53

ఉపాధ్యాయుల భారీ ర్యాలీ

ప్రజాశక్తి - పార్వతీపురం : విద్యార్థి, ఉపాధ్యాయ సమస్యలపై ఐక్యపోరాటాలకు సిద్ధం కావాలని, సిపిఎస్‌ రద్దు చేసే రాజకీయ పార్టీకే తమ ఓటని యుటిఎఫ్‌ నాయకులు స్పష్టం చేశారు. యుటిఎఫ్‌ 50వ స్వర్ణోత్సవాల్లో భాగంగా స్థానిక డిఇఒ కార్యాలయం నుంచి సభావేదికైన స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వరకు డప్పులు, గిరిజన నృత్య ప్రదర్శనలతో భారీ ర్యాలీగా ఉపాధ్యాయులు వచ్చారు. కొమరాడ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికోన్నత పాఠశాలల విద్యార్థినిలు ప్రదర్శించిన 'పాడుదమా స్వేచ్ఛాగీతం' పాటకు నృత్యం, థింసా నృత్యం ఆహూతులను అలరించాయి. యుటిఎఫ్‌ సభ్యులు నాగభూషణం తుడుము దరువుతో ఊరేగింపు జరిగింది. అనంతరం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో యుటిఎఫ్‌ జెండాను ఆ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు ఆరిక భాస్కరరావు ఆవిష్కరించారు. అనంతరం సంఘం జిల్లా అధ్యక్షులు టి.రమేష్‌ అధ్యక్షతన జరిగింది. ఈ ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర ఎస్‌టి కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ డివి శంకర్రావు మాట్లాడుతూ తరగతి గదిలో దేశ భవిష్యత్తు తీర్చిదిద్దుకునే మహోన్నతమైన కార్యరంగంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు సమాజానికి ఆదర్శమని అన్నారు. పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పార్వతీపురం మన్యం ఎర్రజెండా ఉద్యమాలకు పురిటిగెడ్డ అన్నారు. ఈ జిల్లాలో అత్యధిక మండలాలు గిరిజన ప్రజల నివసించేవి గాను ఉన్నాయని, ఇక్కడ గిరిజనులను దోచుకొనే భూస్వాములను అడ్డుకునేందుకు చౌదరి తేజేశ్వరరావు, ఆదిభట్ల కైలాసం, వెంపటాపు సత్యం వంటి వారు పోరాడారన్నారు. వీరి పోరాట ఫలితంగా ఐటిడిఎ, జిసిసి, 1/70 చట్టాలు వచ్చాయన్నారు. అయినా గిరిజనుల బతుకులు మారలేదని, వాటిని మార్చాలంటే ఉపాధ్యాయుల వల్లే సాధ్యమని అన్నారు. అందుకు ఉపాధ్యాయులు విద్యార్థులకు సమాజంపై అవగాహన పెంచేలా చూడాలన్నారు. యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ యుటిఎఫ్‌ 50వ స్వర్ణోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా జరపాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించిందన్నారు. అందులో భాగంగానే జిల్లాలో ఈ స్వర్ణోత్సవాలు జరుగుతున్నాయన్నారు. ఈ స్వర్ణోత్సవాలు మన్యం జిల్లాలో జరుపుకోవడమే కాకుండా మరో 50 ఏళ్లు యుటిఎఫ్‌ ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లాలన్నారు. ఈ గిరిజన ప్రాంతంలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు మెనూ చార్జీలు పెంపునకై పోరాడగా, కొంతమేరకు ప్రభుత్వం పెంచినా ఇంకా అసంపూర్తిగానే ఉందన్నారు. భాషా విద్యా వాలంటీర్లు, సిఆర్‌టిలను రెగ్యులర్‌ చేయడంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తుందన్నారు. వీటన్నింటిపై రానున్న రోజుల్లో ఐక్య పోరాటాలు చేసి సాధించుకోవాలని పిలుపునిచ్చారు. పార్వతీపురం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి బోనల విజయచంద్ర మాట్లాడుతూ యుటిఎఫ్‌ ఉద్యమాలకు తాము అండగా నిలుస్తామన్నారు. జెఎసి జిల్లా ఛైర్మన్‌ కిషోర్‌ మాట్లాడుతూ సిపిఎస్‌ రద్దుకు యుటిఎఫ్‌ అలుపెరగని పోరాటం చూస్తుందని, వీరి పోరాటాలకు జెఎసి తరఫున సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామన్నారు. సభలో గిరిజన సంక్షేమశాఖ డిడి కె.శ్రీనివాసరావు, ప్రముఖ రచయిత గంటేడ గౌరినాయుడు, సిఐటియు జిల్లా సీనియర్‌ నాయకులు ఎం.కృష్ణమూర్తి, యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యవర్గసభ్యులు ఎస్‌.మురళీమోహనరావు, రాష్ట్రకార్యదర్శి చౌదరి రవీంద్ర, నాయకులు డి.రాము, జిల్లా కార్యదర్శులు, ఆఫీసుబేరర్లు, పెద్దసంఖ్యలో ఉపాధ్యాయు పాల్గొన్నారు.