Sep 24,2023 21:13

అధికారులను నిలదీస్తున్న సభ్యులు

ప్రజాశక్తి - నెల్లిమర్ల : మండల సర్వ సభ్య సమావేశంలో అధికార పార్టీ సభ్యులే అధికారులను నిలదీశారు. ఆదివారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ముఖ్య అతిథిగా సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికార వైసిపి సర్పంచులు, ఎంపిటిసిలు పలు సమస్యలను లేవనెత్తి అధికారులను నిలదీశారు. ముఖ్యంగా సతివాడ సర్పంచ్‌ రేవల్ల శ్రీనివాసరావు, ఎంపిటిసి రెడ్డి సత్యనారాయణ గత కొన్నేళ్లుగా తోటపల్లి ప్రాజెక్టు ద్వారా సాగు నీరు పొలాలకు అందడం లేదని, ప్రధాన కాలువ ద్వారా వచ్చే నీరు గుర్ల మండలం రాగోలు వరకు వచ్చి ఆగిపోయిందని సభ దృష్టికి తీసుకొచ్చారు. పశు సంవర్థక శాఖకు చెందిన మొబైల్‌ వాహనంలో పశువైద్యులు ఉండడం లేదని ఆ శాఖ సిబ్బందిని నిలదీశారు. వైస్‌ ఎంపిపి సారికి వైకుంఠం నాయుడు, బొప్పడాం సర్పంచ్‌ బొంతు కిరణ్‌ జల జీవన్‌ మిషన కింద ఇంటిటికి తాగు నీరు అందించడానికి ప్రాజెక్టు మొదలైందని ఇంతవరకు పనులు పూర్తి కాలేదు సరికదా అసలు అలుగోలు గ్రామంలో ఇంతవరకు జెజెఎల్‌ మిషన్‌ పనులు ప్రారంభించక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. కొన్ని గ్రామాల్లో పనులు జరిగినా వాటికి బిల్లులు చెల్లించక పోవడం ఏమిటని గ్రామీణ నీటి సరఫరా పథకం జెఇని నిలదీశారు. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా గ్రామాల్లో లో ఓల్టేజ్‌, తీగలు వదులుగా ఉండడం, ట్రాన్స్‌ ఫార్మర్‌ మార్చడం, శిధిల స్తంభాలు తీసి కొత్త స్థంబాలు వేయడం వంటి సమస్యలు పరిష్కరించలేని విద్యుత్‌ శాఖ పని తీరుపై అన్ని గ్రామాల నుంచి సభ్యులు ఎఇని నిలదీశారు. ప్రతీసారీ గ్రామాల్లో ఎదుర్కొంటున్న విద్యుత్‌ సమస్యలు మొరపెట్టుకున్నా సరామామూలే అన్న చందంగా అధికార్లు, నాయకుల తీరు ఉందని ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు మండిపడ్డారు. సమస్యలు పరిష్కరించనపుడు సమావేశాలు ఎందుకు పెడుతున్నారని మండిపడ్డారు. అధికార పార్టీకి చెందిన సభ్యులే అధికారులను నిలదీయడంతో స్పందించిన ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు సంబంధిత అధికార్లతో మాట్లాడి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఎంపిపి అంబళ్ల సుధారాణి, జెడ్‌పిటిసి గదల సన్యాసి నాయుడు, ఎంపిడిఒ జి.రామారావు, తహశీల్దార్‌ డి. ధర్మ రాజు తదితరులు పాల్గొన్నారు.