Sep 11,2023 23:50

అరవిందబాబును పరామర్శిస్తున్న గుంటూరు విజరుకుమార్‌ తదితరులు

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : రాష్ట్రంలో నెలకొన్న సమస్యల గురించి ప్రభుత్వం పట్టించుకోకుండా కక్షపూరిత రాజకీయాలకు తెర తీయడం దుర్మార్గమని సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజరు కుమార్‌ విమర్శించారు. చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా టిడిపి రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో నిరసన తెలుపుతున్న టిడిపి నియోజకవర్గ బాధ్యులు డాక్టర్‌ చదలవాడ అరవింద్‌బాబును పోలీసులు అరెస్టు చేసి ఒన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆయన్ను విజరు కుమార్‌ పరామర్శించి విలేకర్లతో మాట్లాడారు. పంటలు ఎండిపోయి కరువు విలయతాండవం చేస్తుంటే రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం ఆ పని మానేసి అక్రమ అరెస్టులుపై దృష్టి సారించడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు నాయుడు తప్పు చేసి ఉంటే ముందస్తు నోటీసు ఇచ్చి స్పందించకపోతే అరెస్టు చేయాల్సి ఉంటుందని, అయితే చంద్రబాబు నాయుడు అరెస్టులో పోలీసులు నిబంధనలు పాటించలేదని అన్నారు. అరెస్ట్‌ పట్ల టిడిపి శ్రేణులు బంద్‌ చేయడం సహజమని, అయితే అరెస్టులకు పూనుకున్న పోలీసులు వారిని పరామర్శించడానికీ అవకాశం ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉందన్నారు. కాంట్రాక్ట్‌ ఔట్సోర్సింగ్‌ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను పర్మినెంట్‌ చేస్తామని చెప్పి పట్టించుకోకపోవడంతో నిరసన తెలుపుతుంటే ప్రతి ఉద్యమాన్ని ప్రభుత్వం పోలీసులు అడ్డంపెట్టి అడ్డుకుంటోందన్నారు. ధర్నాలకు పోలీసులు అనుమతులు ఇవ్వకపోతే కోర్టుకు వెళ్లి అనుమతులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి రాష్ట్రంలో దాపరించిందన్నారు. పాలకులు కక్షపూరితంగా వ్యవహరిస్తే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందదని అన్నారు. ప్రతిపక్ష నాయకులు నేరాలు చేస్తే నేరాలు నిరూపించి శిక్ష వేయాలి కానీ కక్షపూరిత ధోరణి పనికిరాదన్నారు. నిరసన కార్యక్రమాలు హింసాత్మంగా మారిన నేపథ్యంలో లేదా ప్రజలకు ఇబ్బంది కలిగిన నేపథ్యంలో మాత్రమే అరెస్టులు చేయాల్సి ఉంటుందని, అలా కాకుండా నియంతలుగా వ్యవహరిస్తే ప్రజలు తగిన విధంగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. అరవిందబాబును పరామర్శించిన వారిలో సిపిఎం పట్టణ కార్యదర్శి సిలార్‌ మసూద్‌, నాయకులు డి.శివకుమారి, మస్తాన్‌వలి, రబ్బాని, ఆంజనేయులు, వెంకయ్య, ప్రేమసాగర్‌ ఉన్నారు.