Nov 03,2023 20:59

ప్రజా సమస్యలు వింటున్న కలెక్టర్‌, ఎమ్మెల్యే

చాపాడు : ప్రజలనుంచి వచ్చిన సమస్యలలో అవకాశం ఉన్న వాటిని వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ విజయరామరాజు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో ఎమ్మెల్యే ఎస్‌.రఘురామిరెడ్డి తో కలిసి జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి సోమవారమూ సమస్యల పరిష్కారం కోసం కడపకు ప్రజలు రావాల్సిన అవసరం లేకుండా అధికారులనే మండలానికి వచ్చే ఏర్పాటు చేశామన్నారు. చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయని, అలాంటి వాటి పట్ల అశ్రద్ద చూపకుడదని చెప్పారు. సచివాలయ సిబ్బంది పనితీరు, ఇకెవైసి, జగనన్న ఆరోగ్య సురక్ష, ఎఎన్‌ఎం, మహిళా పోలీస్‌ సిబ్బంది పనితీరు అధికారులు పరిశీలించాలన్నారు. వాలంటీర్ల అటెండెన్స్‌ 68 శాతం మాత్రమే ఉందని సరిగా పని చేయని వారిని తొలగించాలని ఆదేశించారు. చియ్యపాడు, అయ్యవారిపల్లె, సోమాపురం నుంచి ఫిర్యాదులు అధికంగా వస్తున్నాయన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల నుంచి అందే సమస్యలను అధికారులు పరిశీలించాలన్నారు. కొంత మంది అభివద్ధిని అడ్డుకునేందుకు అర్జీలు పెడుతుంటారని వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ప్రజల వద్దకే సమస్యలు తెలుసుకునేందుకు అధికారులు రావడం సంతోషంగా ఉందన్నారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో 180 మంది అర్జీలు అందజేశారు. కార్యక్రమంలో జెసి గణేష్‌ కుమార్‌, ఆర్‌డిఒ శ్రీనివాసులు, జిల్లా స్థాయి అధికారులు, ఎంపిపి టి.లక్షుమయ్య, మండల ప్రత్యేక అధికారి సురేష్‌రెడ్డి, తహశీల్దార్‌ యామిని, ఎంపిడిఒ శ్రీధర్‌ నాయుడు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.