
కలెక్టరేట్ పరిపాలన అధికారి అప్పారావు
ప్రజాశక్తి - భీమవరం
స్పందన ద్వారా వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టరేట్ పరిపాలనాధికారి అప్పారావు కోరారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జిల్లా నలుమూలలా ప్రజల నుండి వచ్చిన 162 వినతలను పరిపాలనాధికారి అప్పారావుతో పాటు డిఎస్‌పి డి.శ్రీనాథ్, డిఆర్‌డిఎ పీడీ ఎంఎస్‌ఎస్.వేణుగోపాల్, జిల్లా మత్స్యశాఖ అధికారి ఆర్‌విఎస్.ప్రసాద్ స్వీకరించారు. భీమవరం ముత్రాసుల దిబ్బ శివారు అడ్డ సందు ప్రాంతంలో తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని, అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకోవడం లేదని పి.దుర్గారావు, స్థానికులు ఫిర్యాదు చేశారు. పంట భూముల మధ్య ఉన్న డ్రెయిన్ పూడుకుపోవడంతో సుమారు 50 ఎకరాల పంట పొలాలు నీటమునిగి నష్టపోతున్నామని, డ్రెయిన్‌లో పూడిక తీయాలని యలమంచిలి మండలం అడవిపాలెంకు చెందిన చిన్నకారు రైతు ఉల్లంపర్తి వెంకటేశ్వరరావు కోరారు. అత్తిలి మండలం ఆరవల్లి గ్రామంలో రీసర్వేలో తన భూమి తక్కువైందని పరిష్కరించాలని వి.నారాయణరెడ్డి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో గృహాలు నిర్మించుకుని ఉంటున్న కొత్తకాలనీ వాసులు కాలనీకు అనుకుని ఉన్న పంట భూమిని రొయ్యల చెరువుగా తవ్వేస్తున్నారని, వెంటనే చెరువు తవ్వకం పనులను ఆపాలని భీమవరం మండలం గొల్లవానితిప్ప గ్రామానికి చెందిన ములపర్తి కేశవరావు, ముస్కుడి సింహాచలం, ములపర్తి బంగారమ్మ, మద్దా మరియమ్మ, చుట్టుగుళ్ల రవి ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.