Sep 22,2023 21:02

చెరువు ఆక్రమణ గురించి కలెక్టర్‌కు వివరిస్తున్న రామారావు

ప్రజాశక్తి- నెల్లిమర్ల : సమస్యలను సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి అన్నారు. జగనన్నకు చెబుదాం ప్రజా వినతుల కార్యక్రమాన్ని మండల స్థాయికి విస్తరించే చర్యల్లో భాగంగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్నిశుక్రవారం నెల్లిమర్ల మండల కేంద్రంలో నిర్వహించారు. మండల పరిషత్‌ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ వర్గాల ప్రజల నుంచి 86 వినతులు స్వీకరించారు. జిల్లా కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి, జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌, మున్సిపల్‌ కమీషనర్‌ బాలాజీ ప్రసాద్‌, తహశీల్దార్‌ ధర్మ రాజు, ఎంపిడిఒ రామారావు, మండల ప్రత్యేకాధికారి వినతులను స్వీకరించారు. మండలస్థాయి వినతుల స్వీకార కార్యక్రమంలో రెవిన్యూశాఖకు సంబంధించి 26, గృహ నిర్మాణానికి సంబంధించి 16, వైద్యారోగ్య శాఖకు 4, పంచాయతీరాజ్‌కు 3, డిఆర్‌డిఎకు 10, పంచాయతీరాజ్‌కు 14, ఆర్‌డబ్లుఎస్‌ శాఖకు 5, మిగిలినవి ఇతర శాఖలకు చెందిన వినతులు అందాయి.
ఈ సందర్భంగా కలెక్టర్‌ నాగలక్ష్మి మాట్లాడుతూ జిల్లా స్థాయిలో ప్రతి ఒక్కరూ హాజరు కాలేరని భావించి మండలాల్లో కూడా జగనన్నకు చెబుదాం వినతుల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా అధికారులంతా ఈ కార్యక్రమంలో స్వీకరించిన ప్రజావినతులను అర్జీదారులో సంతృప్తిని పెంచే దిశగా పరిష్కరించాలని సూచించారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు పూర్తి అవగాహన లేకపోవడం వల్ల కొన్ని ఫిర్యాదులు వస్తున్నాయని, ముందుగా పథకాలపై ఆయా శాఖలు సమగ్రంగా వివరించి అవగాహన కలిగించాలని సూచించారు. వినతుల పరిష్కారంలో మండల అధికారులంతా ఇంటర్‌ డిపార్టుమెంటల్‌ కో ఆర్డినేషన్‌తో పని చేయాలని చెప్పారు.
నెల్లిమర్ల నగర పంచాయతి వైస్‌ చైర్మన్‌ సముద్రపు రామ రావు జిల్లా కలెక్టర్‌ను కలసి నెల్లిమర్ల నగరపంచాయతీ పేరును నెల్లిమర్ల - జరజాపు పేట నగర పంచాయతీగా మార్చాలని కోరారు. జరజాపు పేట రైతు భరోసా కేంద్రానికి, శాఖా గ్రంథాలయానికి పక్కా భవన నిర్మాణానికి స్థలం, నిధులు మంజూరు చేయాలని వినతులను సమర్పించారు. జగనన్న లే అవుట్‌ వేసేందుకు స్థలం చదును చేయాలని, జరజాపుపేటలో జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ దరఖాస్తు సమర్పించారు.
అనంతరం కలెక్టర్‌ నాగలక్ష్మి గాంధీ నగర్‌లో జరుగుతున్నా జగనన్న ఆరోగ్య సురక్ష ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని తనిఖీ చేసారు. ఇంటింటి తనిఖీ బృందంతో మాట్లాడి సర్వే చేస్తున్న తీరు పై ప్రశ్నించారు. లాగిన్‌లో ఏఏ అంశాలు, ఎలా నమోదు చేస్తున్నారని ప్రశ్నావళి ఎలా అడుగుతున్నారనే అంశాలను పరిశీలించారు. వాలంటీర్‌ ద్వారా మెడికల్‌ క్యాంపుకు ప్రతి ఒక్కరూ హాజరయ్యేలా చూడాలన్నారు. బిపి, షుగర్‌ తనిఖీ చేసిన వారికి కలెక్టర్‌ చేతుల మీదుగా టోకెన్లను అందజేశారు. కలెక్టర్‌ వెంట జిల్లా వైద్యారోగ్య అధికారి డాక్టర్‌ భాస్కరరావు, మున్సిపల్‌ కమిషనర్‌ బాలాజీ ప్రసాద్‌, అర్బన్‌ పిహెచ్‌సి వైద్యులు డాక్టర్‌ సమీర, ఎంపిడిఒ, తహశీల్దార్‌, సచివాలయ సిబ్బంది, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
చెరువు ఆక్రమణ నివారించి రైతులను ఆదుకోవాలి
చెరువు ఆక్రమణ నివారించి రైతులను ఆదుకోవాలని రైతు సంఘం నాయకులు కిల్లంపల్లి రామారావు గ్రీవెన్స్‌లో డిమాండ్‌ చేశారు. ఆయన మాట్లాడుతూ జరజాపుపేట కొంతల వాని చెరువు సర్వే నెంబర్‌ 100 ఆక్రమణలకు గురై రైతులు సాగు నీటి ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గతంలో తహశీల్దార్‌, ఇరిగేషన్‌ డిఇ, నగర పంచాయతీ కమిషనర్‌కి కూడా ఫిర్యాదు చేశామని పట్టించుకోలేదని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించి ఆక్రమణలను నివారించాలని కోరారు.

నెల్లిమర్ల : సమస్యల పై పలు మార్లు గ్రీవెన్స్‌లు ఇచ్చినా పరిష్కారం కావడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో కలెక్టర్‌ ఆధ్వర్యంలో జగనన్నకు చెబుతాం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు గ్రామాలకు చెందిన వ్యక్తులు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గ్రీవెన్స్‌లు అందజేశారు. ముఖ్యంగా సారిపల్లి గ్రామానికి పునరావాస ప్యాకేజీ ఇవ్వాలని గత కొన్నేళ్లుగా మొర పెట్టుకుంటున్నారు. అలాగే పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని కోరుతున్నా ప్రభుత్వం అదిగో ఇదిగో అని కాలయాపన చేస్తుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎటి అగ్రహారం గ్రామానికి పునరావాస ప్యాకేజీ కింద రావాల్సిన బకాయిల ఇంతవరకు చెల్లించలేదని చెబుతున్నారు. కొండ వెలగాడ గ్రామం నుంచి రోళ్ళ వాక వెళ్లే రహదారిని మిత్రా లే అవుట్‌ యజమాని ఆక్రమించడం వల్ల 5 గ్రామాలకు చెందిన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పూతికపేటలో గృహ జ్యోతి లే అవుట్‌ యజమాని గ్రామంలో చెరువులోకి వచ్చే నీటి కాలువను ఆక్రమించుకొని రహదార్లు వేశారని దాని వల్ల రైతులకు సాగు నీరు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కొండవెలగాడకు చెందిన వృద్దుడు అర్హత ఉన్నా పింఛన్‌ మంజూరు చేయలేదని గ్రీవెన్స్‌ ఇచ్చారు. స్థానిక భవిత కేంద్రంలో తన పిల్ల చదువు తుందని మహిళ తనకు పిల్లను చూసుకొని పని చేసే విధంగా అవకాశం కల్పించాలని పలుమార్లు గ్రీవెన్స్‌ ఇచ్చినా అధికార్లు స్పందించలేదని మరోసారి గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. సారిపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి టిఅర్‌టిఎస్‌ ప్రాజెక్టులో తన భూమి పోయిందని ఇంకా ఎకరా 3సెంట్ల భూమికి నష్ట పరిహారం ఇవ్వలేదని పలు మార్లు కలెక్టర్‌ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోక పోవడంతో ప్రస్తుతం గ్రీవెన్స్‌ ఇచ్చారు. పలు మార్లు గ్రీవెన్స్‌లు ఇచ్చినా సమస్యలు పరిష్కారం చేయడం లేదని బాధితులు వాపోతున్నారు.
వృద్దాప్య పింఛను రావడం లేదు
నాకు 60 సంవత్సరాలు పూర్తయ్యాయి. అయినప్పటికీ ఇప్పటికీ నాకు వృద్దాప్య పింఛను రావడం లేదు. ఇప్పటికే పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. వాలంటీరు, సెక్రటరీ సరైన సమాధానం కూడా చెప్పడం లేదు. అందుకే నేరుగా జిల్లా కలెక్టర్‌కు నా సమస్యను చెప్పుకుందామని వచ్చాను.
బట్టు పైడితల్లి, కొండవెలగాడ
ఇంకా నష్టపరిహారం ఇవ్వలేదు
తారకరామతీర్థ సాగర్‌ ప్రాజెక్టులో నాకున్న 1.23 ఎకరాల భూమిని కోల్పోయాను. అప్పటి నుంచి నష్టపరిహారం కోసం తిరుగుతూనే ఉన్నాను. ఎన్ని కార్యాలయాలకు వెళ్లి ఫిర్యాదు చేసినా సమాధానం లేదు. నష్టపరిహారం అందక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాను. ఇప్పటికే మండల స్థాయిలో అధికారులకు, జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాదు చేశాను. కానీ స్పందన లేదు. దీంతో నేరుగా నా బాధను కలెక్టర్‌కు చెప్పుకుందామని వచ్చాను.