Apr 14,2023 00:47
కరపత్రాలు పంపిణీ చేస్తున్న ఉద్యోగులు

ప్రజాశక్తి-బాపట్ల రూరల్‌: ఇప్పటికైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే, ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని జేఏసీ జిల్లా చైర్మన్‌ సిహెచ్‌ సురేష్‌ బాబు హెచ్చరించారు. అమరావతి రాష్ట్ర కమిటీ మలిదశ ఉద్యమ కార్యాచరణంలో భాగంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన ప్రదర్శనలు కొనసాగుతూనే వున్నాయి. ప్రభుత్వం ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు, పెండింగ్‌ సమస్యలపై అన్ని శాఖల ఉద్యోగులకు అవగాహన కల్పిస్తూ, సమస్యలతో కూడిన కరపత్రాలు సర్వే కార్యాలయం, జిల్లా పౌరసరఫరాల శాఖ కార్యాయం, జిల్లా గిడ్డంగుల శాఖ కార్యాలయం, ఉద్యోగులకు, ఆర్‌డీఓ కార్యాలయ సిబ్బందికి, జిల్లా రిజిస్ట్రార్‌, ట్రెజరీ కార్యాలయాల్లో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అసోసియేషన్‌ కోశాధికారి బి ఓంకార్‌, సిటీ యూనిట్‌ అధ్యక్ష కార్యదర్శులు షేక్‌ మహబూబ్‌ బాషా, ఆర్‌ సుమంత్‌ కుమార్‌ మాట్లాడుతూ ఈ పోరాటం న్యాయమైన తమ సమస్యలు పరిష్కారం అయ్యేవరకు ఆగదని ప్రసంగించారు. ఉద్యోగుల పెండింగ్‌ డీఏ, పిఆర్‌సీ ఇతర బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం తమకు కేటాయించిన బడ్జెట్‌లోని మొత్తాలను సకాలంలో ఎందుకు చెల్లించదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో డివిజనల్‌ సర్వే అధికారి ఎం శ్రీనివాసరావు, బి సుశీల, పార్వతి, జీ అనిత, కె సత్యమంగలాంబ తదితరులు పాల్గొన్నారు.