ప్రజాశక్తి - చిలకలూరిపేట : అంగన్వాడీల సమస్యలను పరిష్కరించకుంటే సమ్మెకైనా సిద్ధమవుతామని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) పల్నాడు జిల్లా కార్యదర్శి జి.మల్లీశ్వరి అన్నారు. స్థానిక పండరిపురంలోని సిఐటియు కార్యాలయంలో గురువారం అంగన్వాడీల సమావేశం నిర్వహించారు. మల్లీశ్వరి మాట్లాడుతూ తెలంగాణలో అంగన్వాడీలకు రూ.13,500 జీతం ఇస్తున్నారని, దానికి మించి ఇస్తామనే సిఎం హామీని నెరవేర్చుకోవాలని కోరారు. రిటైర్మెంట్ బెనిఫిట్ రూ.2 లక్షలివ్వాలని, ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చులకు రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనేక యాప్‌లతో అంగన్వాడీలు పని చేయాల్సి వస్తోందని, అయితే వారికి ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లు మాత్రం సరిగా లేక ఇబ్బందులు వస్తున్నాయని చెప్పారు. హెల్పర్లకు ప్రమోషన్లలో నిబంధనలు అమలు కావడం లేదని, రాజకీయ జోక్యాలు ఎక్కువయ్యాయని తెలిపారు. ప్రతినెలా క్రమం తప్పకుండా జీతాలు ఇవ్వడంతోపాటు పెండింగ్ డిఎ బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జి.సావిత్రి, ఎ.పద్మావతి, పి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.










