Nov 28,2022 23:47

తహశీల్దారు కార్యాలయం ఎదుట ధర్నాచేస్తున్న భవన నిర్మాణ కార్మికులు

ప్రజాశక్తి-రాజవొమ్మంగి
భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే పోరాటం ఉధృతం చేస్తామని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు, ఏపీ బిల్డింగ్‌ అండ్‌ అదర్‌ కన్స్ట్రక్షన్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర కమిటీ సభ్యులు పి.రామరాజు అన్నారు. భవన నిర్మాణ కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ శ్రీసీతారామరాజు ఎలక్ట్రికల్‌ ట్రేడ్‌ యూనియన్‌ మండల అధ్యక్షులు కలవపల్లి రాంబాబు ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. తొలిత రాజవొమ్మంగిలో భారీ ప్రదర్శన నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రామరాజు మాట్లాడుతూ, కార్మికులు సమస్యల పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ సంక్షేమ బోర్డు నిధి సుమారు రూ.800 కోట్లు దారి మళ్లించి కార్మికులు పొట్ట కొట్టిందని విమర్శించారు. దీంతో కార్మికులకు రావలసిన క్లైములు, ఇతర బెనిఫిట్స్‌ ఏవి కూడా అందడం లేదన్నారు. కరోనా సమయములో అనేకమంది భవన నిర్మాణ కార్మికులు పనుల్లేక అర్ధాకులతో అలమటించగా, వారికి చెల్లిస్తామన్న కరువు భత్యం నేటికీ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధిని వారికే ఉపయోగించాలని డిమాండ్‌ చేశారు. ప్రమామతో బీమా, పెన్షన్‌ ఇతర బెనిఫిట్స్‌ కల్పించాలన్నారు. అనంతరం స్థానిక డిప్యూటీ తహశీల్దార్‌ ఎ.సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు రాంబాబు, రాము, వి.భద్రం, నాగు, కామరాజు, రాంబాబు, నూకరాజు, శ్రీను, బుజ్జి, అప్పారావు, పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.