Dec 30,2022 00:02

స్థానికులతో మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి కిరణ్‌

ప్రజాశక్తి - రంపచోడవరం
సమస్యలను పరిష్కరించకుంటే ఐటిడిఎను ముట్టడిస్తామని సిపిఎం ఎఎస్‌ఆర్‌ రంపచోడవరం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్‌ హెచ్చరించారు. మండలంలోని కాకవాగ గ్రామంలో రోడ్లను ఆయన గురువారం పరిశీలించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండలంలోని చేలకవీధి, వెట్టిచేలకలు, దబ్బవలస, పిరుకొండ, చింతలగూడెం గ్రామాలకు నిధులు మంజూరు చేసి రోడ్ల నిర్మాణం చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ పాంతంలో సరైన రోడ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం గాని, అధికారులు గాని ఏమాత్రం పట్టించకపోవడం బాధాకరమన్నారు. స్థానిక ఎమ్మెల్యే రహదారికి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసి, దాని నిర్మాణం, నిధులు కోసం పట్టించుకోరా? అని ప్రశ్నించారు. అనేక గ్రామాల్లో మంచి నీటి సమస్య తీవ్రంగా ఉన్నదని, వాటిని పట్టించుకునే నాధుడే లేడన్నారు. చాలా గ్రామంలో గిరిజనులు సాగుచేస్తున్న కొండ పోడు భూములకు పట్టా ఇవ్వలేదని, ఒక్క పక్క ప్రభుత్వం అందరికి పట్టాలు ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటూ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తక్షణమే పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కొన్ని గ్రామాలు వీధి దీపాలకు నోచుకోలేదన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.వాణిశ్రీ, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు సిరిమల్లిరెడ్డి, సహాయ కార్యదర్శి ఇర్ప అజరు, టి.శ్రీను, విద్యాసాగర్‌, జనసేన నాయకులు కుర్ల రాజశేఖరరెడ్డి, సుర్ల అదిరెడ్డి, సోడి బాపన్నదొర, రామిరెడ్డి, పండు రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, బొజ్జి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.