
ప్రజాశక్తి- రాంబిల్లి
తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించే వరకు పోరాటం ఆగదని ఎన్‌ఎఒబి నిర్వాసితులు స్పష్టం చేశారు. మండలంలోని వాడనర్సాపురం వద్ద ఎన్‌ఎఒబి గేట్ ముందు నేవీ నిర్వాసితులు చేస్తున్న ఆందోళన బుధవారం నాటికి 150వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా నేవీ మెయిన్ గేటు ముందు 8 గ్రామాల ప్రజలు బైఠాయించి తమను న్యాయం చేయాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. బుధవారం ధర్నా శిబిరాన్ని సందర్శించిన స్థానిక ఎమ్మెల్యే యువి.రమణమూర్తిరాజు మాట్లాడుతూ రెండు గ్రామాలకు మాత్రమే ఉపాధి కల్పిస్తామని చెప్పారు. దీనిపై నిర్వాసితులు మండిపడ్డారు. మిగిలిన గ్రామస్తుల పరిస్థితి ఏమిటని కేజీ పాలెం గ్రామ సర్పంచ్ బద్ది హరిబాబు, అదే గ్రామానికి చెందిన పెద్ద పప్పల నూకన్నదొర ప్రశ్నించారు. మినిట్స్ కాపీలో ఉపాధి కల్పిస్తామని చెప్పి విషయాన్ని గుర్తు చేశారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు టెంట్ తీసే ప్రసక్తే లేదంటూ స్పష్టం చేశారు.