ప్రజాశక్తి - గుమ్మలక్ష్మీపురం : గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఎంపిపి కె.దీనమయ్య అన్నారు. శనివారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిపి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి పేదవాడికి అందేలా చూడాలని అన్నారు. నాడు నేడులో ప్రభుత్వం అంగన్వాడి, పాఠశాల భవనాలకు ప్రాధాన్యత ఇచ్చిందని, ఈ మేరకు జరుగుతున్నాయని అన్నారు. సర్వసభ్య సమావేశాలకు ప్రజా ప్రతినిధులు ముందుగా వచ్చి వేచి చూస్తున్న అధికారులు మాత్రం సకాలంలో రావడంలేదని అన్నారు. చెముడుగూడ ఎంపిటిసి మండంగి రమణ సభ వేదిక దృష్టికి తీసుకువచ్చారు. అన్ని శాఖల అధికారులు హాజరు కావాల్సి ఉండగా కొంతమంది మాత్రమే వస్తున్నారన్నారు. జీడి పంటకు మద్దతు ధర కల్పించాలని, క్రిమిసంహారక మందులు సరఫరా చేయాలని, పొటాష్ రైతులకు అందుబాటులో ఉంచాలని కోరారు. విద్య, వైద్యం, స్త్రీ శిశు సంక్షేమం, వ్యవసాయ, ఇంజనీరింగ్ తదితర శాఖలపై సమీక్ష జరిగింది. సవర కోటపాడు ఉద్యానవన కేంద్రంలో రూ.2కోట్లతో పర్యాటక ప్రాంత అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని భద్రగిరి ఐటిడిఎ ఎఇఇ అప్పారావు తెలిపారు. ఇప్పటి వరకు 50 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. పూర్తిస్థాయిలో పనులు పూర్తయితే ఈ ప్రాంతం ఎంతగానో అభివృద్ధి చెందుతుందన్నారు. నాడు-నేడులో రూ.1కోటి 24 లక్షలతో అభివృద్ధి కోసం ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. మొరమ, చదునుగూడ గ్రామాల్లో అంగన్వాడీ భవనాలు మంజూరు చేయాలని లక్కగూడ సర్పంచి బిడ్డిక సూర్యారావు కోరారు. రెల్లలో ఉన్న అంగన్వాడి కేంద్ర భవనం పూర్తిగా శిథిలమైందని, కొత్తది మంజూరు చేయాలని సర్పంచ్ కోరారు. సమావేశంలో జడ్పిటిసి మండంగి రాధిక, వైస్ ఎంపిపిలు నిమ్మక శేఖర్, లక్ష్మణరావు, బిసి రజక కార్పొరేషన్ డైరెక్టర్ జి.గిరిబాబు, సర్పంచులు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.










