
ప్రజాశక్తి - విలేకర్ల బృందం
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆశా వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యాన మంగళవారం జిల్లాలోని పలు పిహెచ్‌సిల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా పిహెచ్‌సిల వైద్యాధికారులకు వినతిపత్రాలు అందజేశారు.
మునగపాక రూరల్ : మునగపాక పిహెచ్‌సి వద్ద ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యాన నిరసన తెలియజేశారు. అనంతరం పిహెచ్‌సి వైద్యాధికారి డాక్టర్ అనిల్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కోశాధికారి వివి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆశా కార్యకర్తలు చాలీచాలని జీతాలతో విధులు నిర్వహిస్తున్నారని, పని ఒత్తిడితో అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ వార్డు, సచివాలయాల్లో ఆశా కార్యకర్తలు ఉండాలని, సబ్ సెంటర్‌కు వచ్చి రోజు సంతకాలు పెట్టాలనడం సరికాదని పేర్కొన్నారు. వారిపై వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు కుమారి, ఉమా, వరలక్ష్మి, పద్మ పాల్గొన్నారు.
సబ్బవరం : ఆశావర్కర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ఐద్వా అధ్యక్షులు బి.ప్రభావతి డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక పిహెచ్‌సి వైద్యాధికారి ఎస్‌ఎన్‌ఆర్ చక్రవర్తికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆశా కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, కనీస వేతనాలు నెలకు రూ.26వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జాబ్ చార్ట్ ఇవ్వాలని, అదనపు పనులను అప్పగించరాదని కోరారు. యూనియన్ నాయకులు డి.భవాని, జి.శ్రీకాంతి, జి.వరలక్ష్మి, ఎస్.కృష్ణవేణి, పి.కల్యాణి, డి.జయ, కె.దేవి, వై.కనకమ్మ, ఎ.అనురాధ, సిపిఎం నాయకులు ఎం.గౌరీశ్వరరావు పాల్గొన్నారు.
కశింకోట : స్థానిక పిహెచ్‌సి వద్ద ఆశా కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టి, మెడికల్ ఆఫీసర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు భార్గవి, శాంతి, సిఐటియు జిల్లా నాయకులు దాకారపు శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని కోరారు. కార్యకర్తలు సంతోషి, వెంకటలక్ష్మి, పార్వతి, శ్రీదేవి, లక్ష్మి పాల్గొన్నారు.
పరవాడ : పరవాడ, వాడు చీపురుపల్లి పిహెచ్‌సిల వద్ద ఆశా కార్యకర్తలు ధర్నా నిర్వహించి, మెడికల్ ఆఫీసర్లకు వినతిపత్రాలు అందజేశారు. యూనియన్ మండల నాయకులు వెన్నెల లక్ష్మి అనకాపల్లి వరలక్ష్మి మాట్లాడుతూ ఉద్యోగ భద్రత కల్పించాలని, గ్రూప్ ఇన్సూరెన్స్, మెటర్నిటీ సెలవులు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ, పి.సత్యవతి, లక్ష్మి, మాని, జయ, పి.మణిక్యం పాల్గొన్నారు.
బుచ్చయ్యపేట : మండలంలోని బుచ్చయ్యపేట, తురకలపూడి పిహెచ్‌సిల వద్ద ఆశా కార్యకర్తలు ఆందోళన చేశారు. యూనియన్ నాయకులు సనివాడ లక్ష్మి, దుర్గవరపు వరలక్ష్మి మాట్లాడుతూ ఆశాలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పిఎఫ్, ఈఎస్‌ఐ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించి డిమాండ్ చేశారు. రికార్డులను ప్రభుత్వం సరఫరా చేయాలన్నారు. అనంతరం వైద్యాధికారులు డాక్టర్ రమేష్, డాక్టర్ శాంతికి వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో టేకు అంబిక, లక్ష్మి పాల్గొన్నారు.
రావికమతం : తమ ప్రధాన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ స్థానిక పిహెచ్‌సి వద్ద ఆశాలు ధర్నా నిర్వహించారు. ఆశ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వజ్రపు సత్యవతి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పనిచేసే తమను సచివాలయాల వద్ద ఉండాలనడం విడ్డూరమన్నారు.ఆశా వర్కర్లకు జాబ్‌చార్ట్ వెల్లడించాలని డిమాండ్ చేశారు. అధికారుల ఒత్తిళ్ల నుంచి విముక్తి కల్పించాలని కోరారు. పిహెచ్‌సి వైద్యాధికారి శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు.
మాడుగుల : ఆశాకార్యకర్తల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్త శుద్ధితో పని చేయాలని గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి ఇ నరసింహమూర్తి, ఆశ వర్కర్ల మండల అధ్యక్షులు జి.లక్ష్మి, కార్యదర్శి పడాల ప్రసన్న డిమాండ్ చేశారు. మంగళవారం కెజె పురం పిహెచ్‌సి వద్ద ఆందోళన చేపట్టి, డాక్టర్ లీలా ప్రసాద్‌కు వినతిపత్రం అందించారు.