ప్రజాశక్తి-చింతూరు
ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎపి ఆశ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర కమిటీ పిలుపు మంగళవారం చింతూరులో ఆశా కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. చింతూరు సెంటర్ నుండి డిప్యూటీ డిఎంహెచ్‌ఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, అక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు ఎఎస్‌ఆర్ రంపచోడవరం జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకట్ మాట్లాడుతూ ఆశ వర్కర్ల నియమాకాలు ప్రభుత్వం ద్వారానే జరగాలని, పని భారాన్ని తగ్గించాలని. సెలవులు మంజూరు చేయాలని, కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. శానిటేషన్ కమిటీల ద్వారా నియామకాలు చేయడంతో రాజకీయ నాయకుల ప్రాబల్యం పెరిగి కష్టపడి పని చేసే వారిని తొలగించి వారి స్థానాల్లో అధికార పార్టీ అనుయాయులను నియమిస్తున్నారని విమర్శించారు. ప్రతి రోజూ విలేజ్ క్లినిక్, సచివాలయంలో ఉదయం 9 నుండి సాయంత్రం 5 వరకు ఉండాలని, రెండు పూటలా సంతకాలు చేయాలని వేధించడం సరికాదన్నారు. విలేజ్ క్లినిక్‌లు క్లీన్, ఓపి వర్క్ అటెండర్ పనులు అప్పగించడం దారుణమన్నారు. సంబంధం లేన ఆన్‌లైన్ వర్క్‌లు చేయించడం ఆపాలన్నారు. అనంతరం డిప్యూటీ డిఎంహెచ్‌ఓ డాక్టర్ పుల్లయ్యకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పోడియం లక్ష్మణ్, బి.దిలీప్, టి.లక్ష్మయ్య, ఆశ యూనియన్ నాయకులు వీరమ్మ, దారేశ్వరి, స్వప్న, నాగమణి, ముత్తమ్మ తదితరులు పాల్గొన్నారు.
రంపచోడవరం : 66 రోజుల పాటు ఐటిడిఎ ఎదుట దీక్షలు చేపట్టిన సందర్భంగా నాటి ఆరోగ్య శాఖ మంత్రి, జిల్లా కలెక్టర్ ఇచ్చిన హామీని వెంటనే అమలు చెయ్యాలని ఐటిడిఎ ఎదుట మంగళవారం ఆశా వర్కర్లు ధర్నా చేశారు. అనంతరం ఐటిడిఎ ఎపిఒకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ ఆలిండియా కమిటీ సభ్యులు మట్ల వాణిశ్రీ మాట్లాడుతూ 2021 ఆగస్టు నుంచి నవంబర్ వరకు ఐదుగురు ఆశవర్కర్లు చనిపోవడంతో వారి కుటుంబాలను ఆదుకోవాలని చేపట్టిన 66 రోజుల దీక్షల్లో అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, కాకినాడ జిల్లా కలెక్టర్ హరి కిరణ్ ప్రభుత్వంతో మాట్లాడి అన్ని డిమాండ్స్ పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చి దీక్షలు విరమింపజేశారని గుర్తు చేశారు. కాని ఆ హామీని నేటికీ అమలు చేయలేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు ఈతపల్లి సిరిమల్లి రెడ్డి, ఏడు మండలాల ఆశవర్కర్లు పాల్గొన్నారు.










