ప్రజాశక్తి- చింతూరు
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యాన చింతూరు బస్టాండ్ నుండి ఐటిడిఎ అంగన్వాడీలు గురువారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ ఆందోళన చేపట్టారు. వీరి ఆందోళనకు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు డేగలా మాధవరావు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఎర్రం శెట్టి శ్రీనివాసరావు. గిరిజన సంఘం జిల్లా నాయకులు సీసం సురేష్, కుంజా సీతారామయ్య సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు సున్నం రంగమ్మ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం పిబ్రవరి ఒకటి నుండి అంగన్వాడీ సెంటర్లలో ప్రవేశపెట్టిన ఫేస్ యాప్‌ను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. 2 జిబి మొబైల్స్ ఇచ్చి, 8 జిబి పనులు ఎలా చేయడం సాధ్యమవుతుందని ప్రశ్నించారు. నెట్ సౌకర్యం కూడా కేంద్రాలు ఉన్నాయన్నారు. జాబ్ క్యాలెండర్ నిర్ణయించి, సంక్షేమ పధకాలు అమలు చేయాలని, ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, సంపూర్ణ పోషణకు మెనూ ఛార్జీలు పెంచాలని, వేతనంతో కూడిన మెడికల్ లీవ్‌లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రమోషన్‌కు అర్హత ఉన్న ఆయాలకు, మినీ వర్కర్లుకు కచ్చితంగా పోస్ట్ ఇచ్చిన తర్వాతే ఖాళీలను భర్తీ చేయాలని, మినీ కేంద్రాలను మెయిన్ కేంద్రాలుగా మార్చాలని, పెండింగ్ జీతాలు, బిల్లులు వెంటనే చెల్లించాలని కోరారు. రిటైర్డ్ మెంట్ బెనిఫిట్స్ రూ.5 లక్షలు ఇవ్వాలని, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని, 2017 నుండి టిఏ డిఏ, ఇవ్వాలని డిమాండ్ చేశారు. పర్యవేక్షణ పేరుతోనూ, ఫుడ్ కమిషన్ వేధింపులు ఆపాలని, హెల్పర్లకు వయోపరిమితి లేకుండా అంగన్‌వాడీ వర్కర్లుగా ప్రమోషన్ ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కార్యదర్శి పోడియం లక్ష్మణ్, సహాయ కార్యదర్శి దిలీప్, ఈ నాలుగు మండలాల అంగన్వాడీ ప్రాజెక్టు లీడర్లు సావిత్రి, రాజేశ్వరి, అన్నపూర్ణ, పార్వతి, వెంకటరమణ, దుర్గ, పెద్ద సంఖ్యలో అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.










