ప్రజాశక్తి -నర్సీపట్నం టౌన్ :మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలని మండల విద్యాశాఖ అధికారిని సాయి శైలజకు మధ్యాహ్నం భోజనం కార్మిక సంఘ జిల్లా అధ్యక్షురాలు కే.ప్రసన్న ఆధ్వర్యాన వినతి పత్రాన్ని శనివారం అందించారు. ఈ సందర్భంగా ప్రసన్న మాట్లాడుతూ, మధ్యాహ్నం భోజన కార్మికులకు ప్రతి నెలా 5వ తేదీ లోపు వేతనాలు చెల్లించాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రమాదబీమా సౌకర్యం కల్పించి, వంట చేసేటప్పుడు అగ్నిప్రమాదానికి గురైతే పరిహారం చెల్లించాలని పేర్కొన్నారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో వంట చేస్తుండగా అగ్ని ప్రమాదానికి గురై మృతి చెందిన కార్మికురాలు మలిపెద్ది రమాదేవి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.20 లక్షల నష్టపరిహారం చెల్లించి, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు.వంట గ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేసి, సామాజిక భద్రతా సౌకర్యాలు కల్పించాలన్నారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించరాదని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని తెలిపారు.మధ్యాహ్న భోజన పథకం కార్మికులతో ప్రభుత్వం వెట్టిచాకిరి చేయిస్తుంది తప్ప సామాజిక భద్రత పెన్షన్లు ఇవ్వలేదన్నారు. మధ్యాహ్న భోజన పథకం అమలుకు పాఠశాలలో వంటషెడ్లు, పాత్రలు, మంచినీరు, వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు.










