
ప్రజాశక్తి - దేవరపల్లి విశ్రాంత ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఎపి ప్రభుత్వ మాజీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి సూర్య ప్రకాశరావు కోరారు. తూర్పు గోదావరి జిల్లా ఖజానా అధికారి ఎన్ సత్యనారాయణను అసోసి యేషన్ ప్రతినిధులు కలిసి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందించారు. ప్రతి నెల ఒకటో తేదీన పెన్షనర్లు అందరికీ పెన్షన్ చెల్లించాలని, సిఎఫ్‌ఎంఎస్‌లో వచ్చే సమస్యలు సత్వరం పరిష్కరించాలని, సర్వీస్ పెన్షనర్ స్పౌజ్ పుట్టిన తేదీని సిఎఫ్‌ఎంఎస్‌లో నమోదు చేయాలని, నెలవారి పేస్లిప్ లు విశ్రాంత ఉద్యోగులు సులభంగా డౌన్లోడ్ చేసుకునేలా సాఫ్ట్‌వేర్‌ను మార్పు చేయాలని, అడిషనల్ క్వాంటం ఇంక్రిమెంట్ అదే నెలలో మంజూరు చేయాలని, సర్వీస్ పెన్షనర్ స్పౌజ్ మరణించిన సందర్భంలో ఇవ్వవలసిన మట్టి ఖర్చులు వెంటనే చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా శాఖ అధ్యక్షులు పల్లా సత్యనారాయణ మూర్తి, ఉపాధ్యక్షులు పిఎస్ ప్రసాదరావు, కోశాధికారి దాసరి సాయిబాబా, ఆర్గనైజింగ్ కార్యదర్శి దువ్వూరి కామేశ్వర శర్మ, స్టేట్ ఇసి మెంబర్ మావూరి వీరభద్ర రావు పాల్గొన్నారు.