Jun 03,2023 23:56

మాట్లాడుతున్న వెంకన్న


ప్రజాశక్తి-కొత్తకోట:నాన్‌ షెడ్యూల్‌ గిరిజన గ్రామాలను 5వ షెడ్యూల్లో చేర్చాలని, నర్సీపట్నం కేంద్రంగా ఐటిడిఏ ఏర్పాటు చేయాలని, గిరిజన సమస్యలపై ప్రత్యేకించి జిల్లా కలెక్టర్‌, ఐటీడీఏ పీవో నర్సీపట్నం కేంద్రంగా స్పందన కార్యక్రమం నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ రావికమతం మండల కేంద్రంలో అనకాపల్లి జిల్లా ఆంధ్రప్రదేశ్‌ గిరిజన సంఘం, 5వ షెడ్యూల్‌ సాధన కమిటీ ఆధ్వర్యంలో శనివారం మూడవ జిల్లా మహాసభలను నిర్వహించారు. ఈ సమావేశానికి స్థానిక గిరిజన సంఘం ప్రతినిధులు తోకల అప్పారావు, బూరిగ నూకరత్నం అధ్యక్షత వహించారు.ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్‌ గిరిజన సంఘం రాష్ట్ర కార్య వర్గ సభ్యలు డి. వెంకన్న, విశాఖ ఉమ్మడి జిల్లా గౌరవ అధ్యక్షులు కె. గోవిందరావు తదితరులు మాట్లాడుతూ, నాన్‌ షెడ్యూల్‌ మండలాల్లో 9 మండలాలు, 261 గ్రామాలు ఏజెన్సీని ఆనుకొని ఉన్న గిరిజన సమస్యలపై ఐటిడిఏ సిబ్బంది, అనకాపల్లి జిల్లా కలెక్టర్‌ పట్టించుకోలేదన్నారు. దీంతో, జగనన్న భూ సర్వేలో గిరిజనుల పట్టా భూములో గిరిజనేతలకు పట్టాలు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రానున్న కాలంలో గిరిజనులు ఐక్యంగా పోరాడటంతో గిరిజన సమస్యలు పరిష్కారం అవుతాయని పిలుపు నిచ్చారు. నాన్‌ షెడ్యూల్‌ ఏరియాలో గిరిజనులకు నేటికీ గిరిజనులుగా గుర్తింపు పొందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గిరిజనులను 5వ షెడ్యూల్లో చేరుస్తామని ఓట్లు వేసుకొని గెలిచిన తర్వాత ముఖం చాటేస్తున్నారన్నారు. గిరిజన సాగు భూములను గిరిజనేతర రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు ఆక్రమిం చుకుంటున్నా రెవెన్యూ అధికారులు, రాజకీయ నాయకులు కొమ్ము కాస్తున్నారని విమర్శించారు.నేటికీ కుల సర్టిఫికెట్లు, ఆధార్‌ కార్డుల కోసం కార్యాలయాల చుట్టూ ఆదివాసీలు తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.జీడి మామిడి రైతులకు బ్యాంకు రుణాలు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు.నాన్‌ షెడ్యూల్‌ గిరిజనులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభి స్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి నరసింహ మూర్తి, తొమ్మిది మండలాల నుంచి గిరిజన సంఘం ప్రతి నిధులు పలువురు పాల్గొన్నారు.