ప్రజాశక్తి - అమరావతి : ప్రజా సమస్యలు పూర్తిగా పరిష్కరించాలనే లక్ష్యంతో 'మన కోసం శంకరన్న' పేరుతో గ్రామ సభలు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అన్నారు. అమరావతి మండలం మండెపూడి, నరకుళ్లపాడులో మంగళవారం 'మన కోసం శంకరన్న' గ్రామ సభలు నిర్వహించి ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చిన సమస్యలను ఎంత వరకు పరిష్కరించారని అధికారులతో సమీక్షించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అందడం లేదనే ఫిర్యాదులు పరిష్కారం అయ్యాయని, తన దృష్టికి వచ్చిన సమస్యల్లో దాదాపు 90 శాతానికి పైగా ఇప్పటికే పరిష్కరించామని అన్నారు. మిగిలిన వాటిని త్వరలో పూర్తి చేస్తామన్నారు. మండెపూడి ఎస్సీ కాలనీ శ్మశాన వాటిక దగ్గర కల్వర్టు నిర్మిస్తామని, శివాలయం దగ్గర ఉపాధి హామీ నిధుల ద్వారా పైపులైను వేస్తామని చెప్పారు. ఎస్సీ కాలనీలో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్ సమస్యను అక్టోబర్ 15లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మండెపూడి నుంచి పరస వరకు రోడ్డు నిర్మాణం కోసం రూ.1.5 కోట్లు మంజూరయ్యాయని, టెండరు ప్రక్రియా ముగిసిందని, నిర్మాణం త్వరలోనే ప్రారంభం అవుతుందని వివరించారు.










