Sep 26,2023 20:59

వేపాడ: కిటికీలకు డోర్లు లేని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహం

డెంకాడ, వేపాడ మండలాల్లో ఉన్న ఆదర్శ, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు సమస్యలతో సతమతమవుతున్నాయి. ఒక్కో పాఠశాలలో ఒక్కో సమస్యతో విద్యార్థులు, సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. డెంకాడ మండలంలోని అక్కివరం మోడల్‌ పాఠశాలకు ప్రహరీ, నైట్‌ వాచ్‌మెన్‌ లేక పశువులు, పాములు స్కూల్లోకి వచ్చేయడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వేపాడ మండలం బక్కునాయుడుపేట వద్ద సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సిబ్బందికి వేతనాలు సకాలంలో అందక అవస్థలు పడుతున్నారు. భవనాలకు కిటికీలు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు.

ప్రజాశక్తి- డెంకాడ, వేపాడ : డెంకాడ మండలంలోని అక్కివరం ఎపి మోడల్‌ స్కూల్‌కు ప్రహరీ గోడ, నైట్‌ వాచ్‌మెన్‌ లేక ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. పాఠశాలలో 720 మంది విద్యార్థులు ఉన్నారు. అక్కడ ఉన్న వసతి గృహంలో వందమంది విద్యార్థినిలు ఈ పాఠశాలకు ప్రహరీ గోడ లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. పాఠశాలలో నైట్‌ వాచ్మెన్‌ లేకపోవడం కూడా పెద్ద సమస్యగా మారింది. అందరూ ఆడపిల్లలే కావడంతో రాత్రి పూట వారికి రక్షణ ఉండటం లేదన్న విషయం ఆందోళనకు గురి చేస్తోంది. ఈ పాఠశాలలో నైట్‌ వాచ్మెన్‌ గా వచ్చిన వ్యక్తి వెంటనే డిప్యూటేషన్‌ పై వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఇక్కడ నైట్‌ వాచ్‌ మెన్‌ లేరు. దీంతో హాస్టల్లో ఉన్న విద్యార్థినిలు రాత్రి సమయంలో భయభ్రాంతులకు గురవుతున్నారు.
విలువైన వస్తువులకు రక్షణ కరువు
ఈ పాఠశాలలో విలువైన వస్తువులు కంప్యూటర్లు తదితర సామాగ్రి ఉన్నాయి. ప్రహరీ గోడ, నైట్‌ వాచ్మెన్‌ లేకపోవడంతో ఉపాధ్యాయులు విద్యార్థులు భయాందోళన గురవుతున్నారు. ఎవరైనా వస్తువులను దొంగిలిస్తే ఎవరు సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నారు. ఈ పాఠశాలలో ఇంటర్‌లో ఎకానమిక్‌ సబ్జెక్టుకి టీచరు లేరు. పాఠశాలలో, హాస్టల్లోనూ ప్లంబింగ్‌ పనులకు నిధులు లేకపోవడంతో నిలిచిపోయాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మాణానికి నిధులు మంజూరు చేసి నైట్‌ వాచ్మెన్‌ ఏర్పాటు చేయాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.
సిబ్బందికి వేతన కష్టాలు
వేపాడ సచివాలయం పరిధిలోని బక్కు నాయుడుపేట వద్ద బిఆర్‌ అంబేద్కర్‌ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల వసతి గృహాంలో పనిచేస్తున్న కొంతమంది టీచర్లకు, నాన్‌ టీచింగ్‌ సిబ్బందికి, సిఆర్‌పిలకు జూలై నెల నుండి నేటి వరకు జీతాలు అందలేదు. దీంతో కుటుంబ పోషణ కష్టంగా మారిందని చెబుతున్నారు. విద్యా శాఖలో పనిచేస్తున్న కంప్యూటర్‌ ఆపరేటర్లు, సిఆర్‌పిలు కూడా జీతాలు అందక అవస్థలు పడుతున్నారు. ప్రతి నెల జీతాలు సకాలంలో అందకపోతే కుటుంబాలను ఎలా పోషించుకోవాలని పలువురు ప్రశ్నిస్తున్నారు.
డార్మెటిరీ కిటికీలకు రెక్కలేవి.?
సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల వసతి గృహంలో విద్యార్థులకు నిర్మించిన డార్మెటిరీ గదులకు ఉన్న కిటికీలకు అమర్చిన రెక్కలు పాడైపోవడం వల్ల దోమలతో పాటు, ఈగలు, ధూళి కూడా లోపలికి చొరబడి ఎండ వల్ల వచ్చే వేడిగాలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ వసతి గృహానికి నాడు నేడు నిధులు మంజూరైనప్పటికీ పూర్తిస్థాయిలో పనులు చేయలేదు. తూతూ మంత్రంగా పైపై మెరుగులు దిద్ది బిల్డింగులకు రంగులు వేయడం తప్ప విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా కిటికీలకు రెక్కలు అమర్చకపోవడం దురదృష్టకరమంటూ విద్యార్థుల తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వసతి గృహంలో ఉపాధ్యాయులు విద్యా బోధనలో లోపాలు లేనప్పటికీ విద్యార్థులు రాత్రి పూట నిద్రించే గదుల్లోకి కిటికీలు లేకపోవడం వల్ల వచ్చే దోమలు, వర్షం వచ్చినపుడు వలుపురు, చలిగాలులతో ఇబ్బందులు పడుతున్నారు. కాగా రానున్న చలికాలంలో మరింత ఇబ్బంది పడే పరిస్థితి ఎదరయ్యే అవకాశం ఉందని విద్యార్థినులు చెబుతున్నారు. అధికారులు స్పందించి కిటికీలకు రెక్కల అమర్చి వసతి గృహంలో నివసిస్తున్న విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.