Jul 13,2023 00:05

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : జిల్లా సమీక్ష కమిటీ (డిఆర్‌సి) సమావేశం కలెక్టరేట్‌లోని ఎస్‌.ఆర్‌.శంకరన్‌ సమావేశ మందిరంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అధ్యక్షతన గురువారం జరగనుంది. వ్యవసాయ, ఉద్యాన, నీటి పారుదల రంగాలతో పాటు గృహ నిర్మాణం, జగనన్న కాలనీల్లో ప్రగతి, జాతీయ ఉపాధి హామీ పథకం, విద్య, వైద్యం, జగనన్న భూ హక్కు తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. వివిధ అంశాలపై జరిగే చర్చల్లో భాగంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పలు సమస్యలను ప్రస్తావించనున్నారు.
ప్రస్తుతం జిల్లాలో ఖరీఫ్‌ సాగు మందకొడిగా సాగుతోంది. జిల్లాలో 2.60 లక్షల ఎకరాల్లో పంటలు వేస్తారని అంచనా వేయగా ఇప్పటి వరకు కేవలం నాలుగు వేల ఎకరాల్లోనే సాగైంది. గతనెలలో సాగునీటికి ప్రకాశం బ్యారేజికి నీరు విడుదల చేసినా కాల్వలకు నీటి విడుదలలో తీవ్ర జాప్యమవుతోంది. బుధవారం నుంచి పశ్చిమ డెల్టాకు 1116 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. జిల్లాలో 1.66 లక్షల ఎకరాల్లో వరి సాగవ్వాల్సి ఉన్నా ఇప్పటి వరకు 300 ఎకరాల్లోనే వరి వెదపద్ధతిలో సాగైంది. వరినాట్లు ఇంకా ప్రారంభం కాలేదు. పత్తిని 3 వేల ఎకరాల్లోనేే వేశారు. మరో 700 ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగు చేశారు. ఉద్యాన సాగుకు సంబంధించి కూరగాయల సాగు పెంపుపై అధికారులు దృష్టి సారించడం లేదు. రాజధాని గ్రామాల్లో వ్యవసాయం ఉపసంహరణ తరువాత ప్రత్యామ్నాయంగా ఇతర ప్రాంతాల్లో ఉద్యానసాగును ప్రోత్సహించలేదు.
ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం అయిన తరువాత కూడా కాల్వల పూడిక తీత, తూడాకు పనులు ప్రారంభం కాలేదు. పనులన్నీ టెండర్ల దశలోనే ఉన్నాయి. ఆల్మట్టిలో నీరు లేకపోవడం వల్ల ఈఏడాది సాగర్‌, పులిచింతలకు ఎప్పుడు నిండుతాయన్నదీ ప్రశ్నార్థకంగా మారింది. సాగర్‌ జలాశయంలో గరిష్ట నీటి నిల్వ 312.04 టిఎంసిలు సామర్ధ్యం ఉండగా బుధవారం నాటికి 147.46 టిఎంసిలు ఉన్నాయి. గతేడాది ఇదే రోజుకు 165.23 టిఎంసిలు నిల్వ ఉంది. పులిచింతల గరిష్ట నీటి నిల్వ సామర్ధ్యం 45.77 టిఎంసిలు కాగా ప్రస్తుతం 22.92 టిఎంసిలకు తగ్గిపోయింది. గతేదాది ఇదే రోజుకు 32.83 టిఎంసిల నిల్వ ఉంది.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనుల్లో పలు మండలాలు బాగా వెనుకబడి ఉన్నాయి. రాష్ట్రంలో గుంటూరు జిల్లా బాగా వెనుకబడి ఉంది. ఉగాది నాటికి 8 వేల ఇళ్లు పూర్తి చేయాలనే లక్ష్యం పూర్తి కాలేదు. ఉగాది వెళ్లిపోయి నాలుగునెలలు అయినా ఇంతవరకు గృహనిర్మాణం ఆశించిన విధంగా వేగం పుంజుకోలేదు. ప్రభుత్వ పాఠశాలలో నాడు-నేడు పనులు మందగమనంగా సాగుతున్నాయి. పాఠశాలల విలీనం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఉన్నత పాఠశాలల్లో జూనియర్‌ కళాశాలలు ఏర్పాటు చేసినా అవసరమైన మేరకు అధ్యాపకులు లేరు. ఆశించిన స్థాయిలో విద్యార్థులు చేరడంలేదు. జగనన్న భూ హక్కు పథకం ద్వారా 223 గ్రామాల్లో సర్వే ప్రారంభించారు. 5.95 లక్షల ఎకరాల భూమి ఉంది. మంగళగిరి, తాడేపల్లి కార్పొరేషన్‌లో కలిపిన గ్రామాలతోపాటు, సిఆర్‌డిఎ పరిధిలోని 29 గ్రామాల్లో సర్వే జరగడం లేదు. మొత్తంగా 50 గ్రామాల్లో సర్వే పనులు మినహాయించారు. మిగతా 173 గ్రామాల్లో రీ సర్వే పనులు జరుగుతున్నాయి. ఈ అన్ని అంశాల్లోని సమస్యలపై ప్రజాప్రతినిధులు సమావేశంలో ప్రస్తావించే అవకాశం ఉంది.