కలికిరి : ఏళ్ల తరబడి పరిష్కారం కాని ఎన్నో సమస్యలకు మండల స్థాయి స్పందన పరిష్కారం చూపించిందని కలెక్టర్ గిరీష పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో కలెక్టర్ అధ్యక్షతన మండల స్థాయి జగనన్నకు చెబుదాం-స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ సచివాలయాల ద్వారా ఇప్పటికే అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం లబ్ధి అందిస్తోందన్నారు. సచివాలయాల ద్వారా 80 శాతానికి పైగా సమస్యలు పరిష్కరిస్తున్నామని తెలిపారు. గ్రామ స్థాయిలో చిన్న చిన్న అంశాలు ఏవైనా జిల్లా అధికారుల దష్టికి రానివి జిల్లా కేంద్రానికి రాలేని వారి కొరకు మండల స్థాయిలోనే జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 2020 సంవత్సరంలో గ్రామాలలో నీటి ఎద్దడి నివారణకు గాను ట్యాంకర్లతో నీళ్లు తోలిన వారి బిల్లులు మంజూరు కాలేదని పలు అర్జీలు కలెక్టర్‌కు రాగా, మిగిలిన అర్జీలు రెవెన్యూ సమస్యలపై వచ్చినట్లు వారు తెలిపారు. ఈ సమస్యలు సత్వర పరిష్కారానికి సంబంధిత అధికారులు ఆదేశించినట్లు తెలిపారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమం ద్వారా ప్రజలందరూ తమ సమస్యలు పరిష్కరించుకోవడానికి మంచి అవకాశమని, ఇలాంటి కార్యక్రమాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, మదనపల్లె ఆర్‌డిఒ మురళి, మాజీ మార్క్‌ఫెడ్ చైర్మన్ నల్లారి తిమ్మారెడ్డి, అన్నమయ్య జిల్లా ఆరోగ్యశ్రీ కో-ఆర్డినేటర్ డాక్టర్ లోకవర్ధన్, ఎంపిపి వేంపల్లి నూర్జహాన్, జడ్‌పిటిసి పద్మజ, ఎంపిడిఒ గంగయ్య, తహశీల్దార్ భాగ్యలత, జిల్లాలోని అన్ని శాఖ అధికారులు, సచివాలయ సిబ్బంది, రాజకీయ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.