ప్రజాశక్తి-రేపల్లె: రేపల్లెలో ఉన్నటువంటి బీసీ కాలేజీ విద్యార్థుల వసతి గృహంలో సమస్యలు పరిష్కరించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో స్థానిక అధికారి మల్లికార్జునరావుకు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ బాపట్ల జిల్లా కార్యదర్శి ఆర్య గత కొద్దిరోజులుగా రేపల్లె ఎస్‌ఎఫ్‌ఐ నాయకుల బృందం పట్టణంలోని పలు హాస్టళ్లను సందర్శించిన నేపథ్యంలో తమ దృష్టికి విద్యార్థులు అనేక సమస్యలు తీసుకొచ్చారని పేర్కొన్నారు. వాటిలో ముఖ్యంగా హాస్టల్లో ఉడికీ ఉడకని అన్నం పెడుతున్నారని, లేదంటే మెత్తగా చిమిడిపోయిన అన్నం పెడుతున్నారని తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఈ విషయంపై హాస్టల్ వార్డెన్లకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని విద్యార్థులు ఎస్‌ఎఫ్‌ఐ దృష్టికి తీసుకొచ్చారని అన్నారు. ముఖ్యంగా రేపల్లె తీర ప్రాంతంలో ఉన్న ఒకే ఒక్క ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చి విద్యార్థులు చదువుకుంటున్నారని, అటువంటి వారికి ఇక్కడ ప్రభుత్వ హాస్టళ్లు ఎంతగానో ఉపయోగపడు తున్నాయని, అటువంటి పేద విద్యార్థులకు నాణ్యతలేని ఆహారాన్ని వండుతూ విద్యార్థులను అనారోగ్యం పాలు చేయడం సరైనది కాదని అన్నారు. విద్యార్థులకు అందాల్సిన రాగిజావ, అరటిపళ్లు, కోడిగుడ్లు కూడా ఇవ్వడం లేదని హాస్టల్ నిర్వాహకుల తీరుపై ఆయన మండిపడ్డారు. ఇప్పటికే డిగ్రీ పరీక్షలు జరుగుతున్నాయని కొద్ది రోజుల్లో ఇంటర్ పాలిటెక్నిక్ పరీక్షలు కూడా రాబోతున్న నేపథ్యంలో విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలని కోరారు. ప్రభుత్వం ఇప్పటికే ఇస్తున్న మెస్ ఛార్జీలను పెరిగిన ధరలకు అనుగుణంగా పెంచాలని, లేని పక్షంలో విద్యార్థులందరూ ఐక్యం చేసి అధికారుల కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు వాసు, రామకృష్ణ, సతీష్, హర్షక్, వైశాల్, దుర్గా భవన్ పాల్గొన్నారు.










