Aug 25,2023 21:42

మట్టిరోడ్డు ఉన్న దృశ్యం

మట్టిరోడ్డు ఉన్న దృశ్యం
సమస్యల వలయంలో గిరిజనులు
ప్రజాశక్తి-కావలిరూరల్‌:సమస్యల వలయంలో సుజాతనగర్‌ గిరిజన కాలనీ సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతుంది. పట్టణంలోని 36వ వార్డులో ఉన్న సుజాతనగర్‌ గిరిజన కాలనీ ప్రజలతో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పసుపులేటి పెంచలయ్య మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుజాతనగర్‌ కాలనీ ఏర్పడి సుమారు 40 సంవత్సరాలు అవుతున్న అప్పటి నుండి ఇప్పటివరకు ఎన్నో ప్రభుత్వాలు మారినప్పటికీ ఈ కాలనీలోనీ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు వైఫల్యం చెందారని అన్నారు.
ఎన్నికల సమయంలో ఎన్నో వాగ్దానాలు చేసి ఓట్లు వేయించుకొని గెలిచిన ప్రజాప్రతినిధులు ఇప్పటివరకు వీరి సమస్యలు పరిష్కరించకపోవడం దారుణం అన్నారు. ప్రజా ప్రతినిధులుగా గెలిచిన వారికి ఇలాంటి సమస్యలు కనపడకపోవడం విడ్డూరంగా ఉందని ఈ గిరిజన కాలనీకి ఇప్పటికీ ప్రధానమైన రోడ్డు వసతి లేదన్నారు. అటవీ ప్రాంతం కావడంతో వీధిలైట్లు వెలగకపోవడంతో రాత్రుల సమయంలో ప్రజలు రాకపోకలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
తాగునీటి కోసం మున్సిపల్‌ అధికారులు ఈ కాలనీలో గతంలో ఎప్పుడో వేసిన రెండు చేతి బోరింగులు సక్రమంగా పనిచేయక శిథిలావస్థకు చేరాయన్నారు. ఉన్న ఒకే ఒక్క బావి కూడా శుభ్రత లేకపోవడంతో నీళ్లు వాడుకోవడానికి పనికి రావడం లేదని చెప్పారు. మున్సిపాలిటీ వారు వేసిన వీధి కుళాయిల ద్వారా రెండు మూడు బిందేల కంటే ఎక్కువ నీళ్లు రావడంలేదని మరికొన్ని వీధి కుళాయిలకు పూర్తిగా నీరు రావడంలేదని తెలిపారు. మున్సిపాలిటీలో భాగమైన ఈ కాలనీ ప్రజలు ఎన్నో సమస్యలు సంవత్సరాల తరబడి ఎదురుకుంటున్నారని ప్రజా సమస్యలు పరిష్క పరిష్కరించాల్సిన మున్సిపల్‌ అధికారులు గాఢ నిద్రలో ఉన్నారన్నారు. ముఖ్యంగా ప్రజా సంక్షేమమే మా సంక్షేమం అని గడపగడపకు జగనన్న పాలన అందిస్తున్నామని చెబుతూ తిరుగుతున్న ఎమ్మెల్యేకి ఇలాంటి సమస్యలు కనపడలేదా అని అన్నారు. పేదలు నివసించే ఇలాంటి కాలనీలు అభివద్ధి చేయలేని ప్రభుత్వం ప్రజాప్రతినిధులు మాది ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటూ తిరుగుతుంటే ప్రజలు నమ్మే స్థితిలో ఉన్నారా అని అన్నారు.
అంతేకాకుండా పట్టణంలో మరికొన్ని కాలనీలు అభివద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయని ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు వెంటనే జోక్యం కల్పించుకొని పలు సమస్యలతో సతమతమవుతున్న సుజాతనగర్‌ ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు కె. చెన్నయ్య, తలపల రత్నం, మేడ వెంకటేశ్వర్లు, కాలనీ ప్రజలు పాల్గొన్నారు.