ప్రజాశక్తి-చింతూరు
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు డివిజన్ కేంద్రంలోని బీసీ బాలికల హాస్టల్‌లో వసతులు కరువై సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతుంది. ఈ వసతి గృహంలో సుమారు 50 మంది బాలికలు ఉంటున్నారు. ప్రతిరోజు మెనూ ప్రకారం ఆహారం ఉండటం లేదని, కనీసం వారానికి ఒక రోజు కూడా చికెన్ పెట్టడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. వసతి గృహం రక్షణ గోడ కూడా శిథిలావస్థకు చేరి కూలేందుకు సిద్ధంగా ఉంది. అయినా పట్టించుకునే నాధుడే లేరు. వంట గదికి చెట్లు మొలిచి స్లాబ్ కూలిపోయేందుకు సిద్ధంగా ఉంది. రెగ్యులర్ వార్డెన్ లేకపోవడంతో హాస్టల్లో ఉన్న బాలికలు అనేక ఇబ్బందులకు గురవుతున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడున్న వార్డెన్‌ను రంపచోడవరం బదిలీ చేశారు. ఆమె ఇక్కడ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తుండడంతో హాస్టల్ బాగోగులు చూసేందుకు అవకాశం లేకుండా పోతుంది. రాత్రి సమయంలో బాలికలలు అనారోగ్యానికి గురైనా, ప్రమాదానికి గురైనా వారిని ఆసుపత్రికి తీసుకెళ్లే అవకాశం కూడా లేదు. హాస్టల్ చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగి అనారోగ్యకర వాతావరణం నెలకొంది. బాలికలకు రక్షణ మంచినీరు లేక నిత్యం అస్వస్థతకు గురవుతున్నారు. తక్షణమే ఈ హాస్టల్‌కు రెగ్యులర్ వార్డెన్‌ను నియమించాలని, మెనూ సక్రమంగా అమలు చేయాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.










