Oct 09,2023 00:04

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన తర్వాత తమకు భవిష్యత్తులో ఎంతో మేలు జరుగుతుందని ఆశించినా ప్రయోజనం ఏమీ లేదని ఎపిఎస్‌ ఆర్టీసీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ప్రభుత్వ ఉత్తర్వులు, సంస్థ అమలు జరుపుతున్న విధానాలు ఉద్యోగులకు తీవ్ర నష్టం కలుగజేసే విధంగా ఉన్నాయని చెబుతున్నారు. ఎదుర్కొంటున్న సమస్యలపై ఇటీవల ఆర్టీసీ ఉద్యోగులు అన్ని డిపోల వద్ద ఆందోళనలు నిర్వహించారు. అనంతరం ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందజేశారు.
కాకినాడ, డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల్లో డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌, ఆఫీసు సిబ్బంది, ట్రాఫిక్‌ సూపర్‌వైజర్లు సుమారు 5 వేల మంది పని చేస్తున్నారు. అయితే వీరందరినీ ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తిస్తూ వైసిపి సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. దీంతో ఉద్యోగులంతా ఎంతో సంతోషించారు. ఇకనుంచి పరిస్థితులు మారతాయని, అనేక ప్రయోజనాలు కలుగుతాయని ఆశించారు. కానీ తీరా ప్రభుత్వ తీరు చూస్తుంటే ప్రయోజనాల కంటే సమస్యలు ఎక్కువయ్యాయని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పెన్షన్‌ ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగానికి భద్రత లేకుండా పోయింది. కారుణ్య నియామకాలు కూడా చేపట్టడం లేదు. మెడికల్‌ అన్‌ఫిట్‌ అయిన వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు. 2017 నుంచి రావాల్సిన పే స్కేలు ఏరియర్స్‌ నేటికీ చెల్లించలేదు. కార్మికులంతా కష్టపడి ఏర్పాటు చేసుకున్న ఎస్‌ఆర్బిఎస్‌, ఎస్‌బిటి స్కీములను రద్దు చేసినా ఆ డబ్బు ప్రభుత్వం నేటికీ ఉద్యోగులకు అందించలేకపోయింది. నాలుగేళ్లుగా లీవ్‌ ఎన్‌కాష్‌మెంట్‌ కూడా ఇవ్వలేదు. శాస్త్రీయమైన సర్వే లేకుండానే క్యాడర్‌ స్ట్రెంత్‌ పేరుతో ప్రభుత్వం జారీ చేస్తున్న అక్రమ బదిలీ ఉత్తర్వుల వలన కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు. అర్హులైన వారికి స్పెషల్‌ గ్రేడ్‌ ఇంక్రిమెంట్లను సకాలంలో ఇవ్వడం లేదు. ఎరియర్స్‌, మెడికల్‌ బిల్లుల మంజూరు విషయాల్లో ట్రెజరీ ఉద్యోగులకు లంచాలు ఇస్తేనే గానీ పని పూర్తి చేయడం లేదు. ఇలా అనేక సమస్యలతో తీవ్రస్థాయిలో సతమతమవుతున్నా ప్రభుత్వం తమను కనీసం పట్టించుకోవడం లేదని ఆర్టీసీ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిఒ నెంబర్‌ 70తో ఎన్నో ఇబ్బందులు
ఈ ఏడాది జూలై 25న ప్రభుత్వం ఇచ్చిన జిఒ 70 తమ ఉపాధికి నష్టం చేకూర్చేలా ఉందని కార్మికులు తీవ్ర ఆవేదన వెలిబుచ్చుతున్నారు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు 34 వరకూ మిస్‌ కండక్ట్‌ (ఉద్యోగులు చేయకూడని పనులు) ఉంటాయి. అంటే విధి నిర్వహణలో అలసత్వం వహించడం, ప్రయాణికులు టిక్కెట్‌ తీసుకోకపోయినా, ఏ రూపంలోనైనా నిరసన తెలియజేయడం, అక్రమంగా ఆర్‌టిసి ఆస్తులను దుర్వినియోగ పరచడం వంటివి మిస్‌ కండక్ట్‌ పరిధిలోకి వస్తాయి. అయితే ఈ జిఒ ద్వారా కొన్ని సవరణలు చేస్తూ రూల్‌ 26ఎ ద్వారా 54 చర్యలను మిస్‌ కాండక్ట్‌ చర్యలుగా జతపరిచారు. ఈ సవరణలోని అంశాలు రాజ్యాంగ విరుద్ధంగా, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. చిన్నపాటి తప్పులకు, పొరపాట్లకు కూడా తీవ్రమైన శిక్షలకు, సస్పెన్షన్లకు, రిమూవల్స్‌కు గురి చేసే విధంగా ఉన్నాయని ఇది సరికాదని చెబుతున్నారు. కావున జిఒను తక్షణమే సవరించి ఉపాధికి భంగంగా ఉన్న క్లాజులలో మార్పులు చేయాలని కోరుతున్నారు. గతంలో ఉద్యోగులను ఏ కారణం చేతనైనా డిపో మేనేజర్‌ సస్పెండ్‌ చేస్తే డిప్యూటీ చీప్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌, రీజినల్‌ మేనేజర్‌ (ఆర్‌ఎమ్‌), ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఈడి) ఇలా మూడు అంచెలలో అప్పీల్‌ చేసుకునే అవకాశం ఉండేది. కానీ జిఒ 71 ద్వారా అప్పిలేట్‌ దొంతరను రెండు అంచెలకు మాత్రమే అవకాశం ఇచ్చారు. గతం నుంచి పెండింగ్‌లో ఉన్న అనేక అప్పీళ్లను పరిష్కరించకపోవడంతో రెండేళ్లుగా సస్పెండ్‌ అయిన ఉద్యోగులకు ఎదురు చూపులే మిగిలాయి. వారి కుటుంబాలు ఆకలి కేకలు వేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇలా అనేక సమస్యల నడుమ విధులు నిర్వర్తిస్తున్నామని ఆర్‌టిసిఉద్యోగులు తీవ్ర ఆవేదన వెలిబుచ్చుతున్నారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు.