ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కె.లెనిన్ - ముగిసిన రెండు రోజుల సైకిల్ యాత్ర
ప్రజాశక్తి - ఏలూరు అర్బన్
ఏలూరు నగరంలోని వసతి గృహాలు సమస్యల వలయంలో చిక్కుకున్నాయని, విద్యార్థులు నరకయాతన అనుభవిస్తున్నారని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కె.లెనిన్ అన్నారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో చేపట్టిన రెండు రోజుల సైకిల్ యాత్ర ఆదివారంతో ముగిసింది. ఈ యాత్రలో భాగంగా ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఏలూరు పట్టణంలో ఉన్న అన్ని హాస్టళ్లకు వెళ్లి విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కె.లెనిన్ మాట్లాడుతూ హాస్టళ్లలో విద్యార్థులకు దోమతెరలు కూడా లేకపోవడం వల్ల విద్యార్థులు రాత్రి నిద్రలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జిఒ నెం.77 వల్ల పేదవిద్యార్థులు పీజీ వంటి ఉన్నత విద్యకు దూరమయ్యారని, ఈ ఇఒ ప్రకారం ప్రయివేటు కళాశాలల్లో చదివేవారికి ఉపకారవేతనాలు నిలిపివేస్తామని, ప్రభుత్వ కళాశాలల్లో చదువుకుందామంటే జిల్లాలో ప్రభుత్వ పీజీ కళాశాలలు లేవన్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు 20 వేల మంది ఇంజినీరింగ్ చదువుతున్నారని, వీరంతా ప్రయివేటురంగంలోనే విద్యను అభ్యసిస్తున్నారని, జిల్లాలో ప్రభుత్వ ఇంజినీరింగ్, ఫార్మసి కళాశాలలు లేవని, అలాగే పట్టణంలోని నర్సింగ్ కాలేజీకి సొంత భవనం లేదని, రెండేళ్ల నుంచి నర్సింగ్ కాలేజీ పనులు జరుగుతూనే ఉన్నాయని తెలిపారు. జిల్లాలో టెక్నికల్ విద్యలో ప్రభుత్వమే కళాశాలలు ఏర్పాటు చేయాలని కోరారు. సంక్షేమ హాస్టళ్లలో మెస్ ఛార్జీలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంచలేదని, ప్రస్తుతం ఇస్తున్న బిల్లులకు మార్కెట్లో ఉన్న ధరలకు చాలా వ్యత్యాసం ఉంటుందని, ఫలితంగా హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడం లేదని, తగినంత సిబ్బందిని, వర్కర్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కోటదిబ్బ ఇంటర్ కళాశాల ఆవరణలో, డిగ్రీ కాలేజీ కూడా ఉందని, ఈ కళాశాల ఏర్పాటుకు ఎస్‌ఎఫ్‌ఐ అనేక పోరాటాలు చేసిందని, అప్పటిలో సమస్యను తాత్కాలిక పరిష్కారం కోసం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో షిఫ్ట్‌ల ప్రకారం నిర్వహించారని, ప్రస్తుతం ఇంటర్‌కు 30 గదులు, డిగ్రీకి 20 గదులు కావాల్సి ఉన్నా కాలేజిలో మొత్తం 30 గదులే ఉన్నాయన్నారు. అదనపు గదులు ఏర్పాటు చేయాలని, డిగ్రీ కాలేజీకి స్థలం కేటాయించి సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నగర కార్యదర్శి ఎల్.రాజేష్, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు హరి, చందు, రాజేష్ పాల్గొన్నారు.










