'నాడూ.. నేడూ'.. అవే సమస్యలు..!
అభివృద్ధికి నోచని దుస్థితి
శిథిలావస్థలో బుట్టాయగూడెం వసతి గృహం
బిక్కుబిక్కుమంటూ చదువులు
గదుల్లోకి శ్లాబు నుంచి వర్షపు నీరు
పరిసరాలు అధ్వానం
ఈగలు, దోమలతో నానా అవస్థలు
పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు
ప్రజాశక్తి - బుట్టాయగూడెం
ఏజెన్సీలోని సంక్షేమ హాస్టళ్లు సమస్యల వలయంలో చిక్కుకున్నాయి. విద్యకు తొలి ప్రాధాన్యతిస్తామన్న ప్రభుత్వ పాలకుల మాటలు ఆచరణలో నీటిమూటలయ్యాయి. ఫలితంగా విద్యార్థులు నరకయాతన అనుభవిస్తున్నారు. సరైన వసతులు, రక్షణ లేక, శిథిలావస్థ భవనాల్లో బిక్కుబిక్కుమంటూ చదువులు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా బుట్టాయగూడెం మండలంలోని హాస్టళ్లు అత్యంత దయనీయ స్థితిలో ఉన్నాయి.
మండలంలోని హాస్టళ్లలో కనీస వసతుల్లేక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చి సంక్షేమ హాస్టళ్లలో ఉంటూ చదువుకుందామని వచ్చిన విద్యార్థులు ఇక్కడి వసతులు చూసి భయపడుతున్నారు. కొందరు దిక్కుతోచని స్థితిలో ఆ సమస్యల మధ్యే విద్యను నెట్టుకొస్తున్నారు. ముఖ్యంగా బుట్టాయగూడెం ప్రభుత్వ గిరిజన సంక్షేమ కళాశాల బాలుర వసతి గృహంలో కనీస సౌకర్యాల్లేక నరకయాతన అనుభవిస్తున్నారు. ఇక్కడ ఐటిఐ, ఎంఎల్‌టి, ఇంటర్, డిగ్రీ చదువుతున్న 150 మంది విద్యార్థులు ఉంటున్నారు. వీరంతా జిల్లాలోని వేలేరుపాడు, కుక్కునూరు మండలాలు, అల్లూరి సీతారామరాజు జిల్లా వంటి సుదూర ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి కాలేజీలలో చదువుకుంటూ ఈ వసతిగృహంలో ఉంటున్నారు. జైలులో ఉన్న ఖైదీలకూ వీళ్లకూ పెద్ద తేడా లేనివిధంగా వసతులున్నాయని పలువురు వాపోతున్నారు. ఇంకా జైలులోని గదులే బాగుంటాయేమోకానీ ఇక్కడి వసతి గృహంలోని గదులు అపరిశుభ్రంగా వ్యాధులకు కారణమయ్యే విధంగా ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అపరిశుభ్రంగా వసతిగృహాలు ఉండటం వల్ల ఐటిడిఎ పరిధిలో ఎంతోమంది విద్యార్థులు అనారోగ్యంతో, విషజ్వరాలతో, అంతుచిక్కని వ్యాధులతో ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. వాటిని చూసిన తర్వాత కూడా ఇంతమంది విద్యార్థులను ఈ అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశంలో ఉంచడమనేది ప్రభుత్వానికి గిరిజనుల పట్ల, గిరిజన విద్యార్థుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతుంది.
శిథిలావస్థలో హాస్టల్ భవనం
వసతి గృహ భవనం శిథిలావస్థకు చేరింది. శ్లాబులు పెచ్చులూడి విద్యార్థులపై పడుతున్నాయి. అనేక చోట్ల శ్లాబు ఐరన్ రాడ్లు బయటకు కనిపిస్తున్నాయి. దీంతో ఏ క్షణాన ఏ ప్రమాదం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ విద్యార్థులు గడుపుతున్నారు. చిన్నపాటి వర్షం పడితే శ్లాబ్ నుండి నీళ్లు విద్యార్థులపై పడుతున్నాయని, దీంతో రాత్రి సమయాల్లో నిద్రకూడా ఉండటం లేదని పలువురు వాపోయారు. వర్షపు నీరు గదుల్లో పడటంతో అనేకసార్లు పుస్తకాలు కూడా తడిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ హాస్టల్ దుస్థితిని అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని పలువురు వాపోతున్నారు. సమస్యను తహశీల్దార్ ఎస్‌ఎస్..శాంతికి విద్యార్థి సంఘాలు, విద్యార్థులు పలుమార్లు వినతిపత్రాలిచ్చి సమస్యను పరిష్కరించాలని కోరడంతో కొంతకాలం క్రితం వసతి గృహాన్ని పరిశీలించి వెళ్లారు తప్ప ఎలాంటి చర్యలూ తీసుకోలేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
పులిరామన్నగూడెం హాస్టల్ విద్యార్థి హత్యతో ఆందోళన
ఇటీవల పులిరామన్నగూడెంలోని గిరిజన సంక్షేమ హాస్టల్ విద్యార్థి హత్యతో విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. హాస్టల్లో నిద్రిస్తున్న విద్యార్థిని హాస్టల్ బయటకు తీసుకెళ్లి అతికిరాతకంగా హత్య చేయడం విద్యార్థులను భయబ్రాంతులకు గురిచేస్తోంది. అసలు హాస్టళ్లలో విద్యార్థుల సంరక్షణ ఇంత ఘోరంగా ఉందా అనే విషయం ఈ ఘటన చెప్పకనే చెబుతుంది. హాస్టల్ వార్డెన్, నైట్‌వాచ్‌మెన్ పర్యవేక్షణాలోపం ఈ ఘటనతో తేటతెల్లమవుతుంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంక్షేమ హాస్టళ్లను అభివృద్ధి చేయాలని, వారికి మెరుగైన వసతులు, సంరక్షణ కల్పించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. అంతేకాక ఇక్కడి హాస్టల్లోనూ కనీస వసతుల్లేక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. సరైన తాగునీరుకూడా ఉండటం లేదని, భోజనం అంతంతమాత్రంగా ఉంటుందని విద్యార్థులు వాపోతున్నారు.
వసతులు కల్పించండి
కారం రాజబాబు, ఇంటర్ ద్వితీయ సంవత్సరం, మారేడుబాక, కుక్కునూరు మండలం
ఉన్నతాధికారులు స్పందించి హాస్టల్లోని సమస్యలు పరిష్కరించాలి. ఏడాది కాలంగా ఇక్కడ ఉంటున్నాను. చాలాఇబ్బంది పడుతున్నాను. ఇన్ని సమస్యల మధ్య మా చదువులు కొనసాగించలేం. బిక్కుబిక్కుమంటూ ఉండాల్సి వస్తోంది.
పలుమార్లు ఆందోళన చేసినా ఫలితం లేదు
పి.కామరాజు, ఎంఎల్‌టి ద్వితీయ సంవత్సరం విద్యార్థి, కాచారం, వెలేరుపాడు మండలం
హాస్టల్లోని సమస్యలను పరిష్కరించాలని పలుమార్లు ధర్నా చేసినా పట్టించుకోలేదు. అనేకసార్లు ఉన్నతాధికారులకు వినతులు అందించాం అయినా ఎలాంటి ఫలితం లేదు. అపరిశుభ్ర వాతావరణం, దోమల బెడదతో నరకయాతన అనుభవిస్తున్నాం.
గదుల్లోకి వర్షపునీరు
వలస చరణ్ తేజ, ఎంఎల్‌టి ద్వితీయ సంవత్సరం, వెంకటరెడ్డిగూడెం పోలవరం మండలం
చిన్నపాటి వర్షానికి నీరు హాస్టల్ గోడలు, శ్లాబ్ నుండి గదుల్లోకి చేరుతుంది. శిథిలావస్థకు చేరుకున్న భవనాల్లో ఉండటం అంటే ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బతకడమే. అధికారులు స్పందించి మా సమస్యలను పరిష్కరించాలి.
ఉన్నతాధికారులకు సమస్యను వివరించాం
బుట్టాయగూడెంలోని హాస్టల్ దుస్థితిని ఉన్నతాధికారులకు వివరించామని ఎటిబ్ల్యూఒ శ్రీవిద్య తెలిపారు. ఐటిడిఎ డీడీ, పిఒలకు తెలియజేశామన్నారు. బుట్టాయగూడెం సమీపంలో ప్రయివేటు భవనాన్ని అద్దెకు తీసుకుని అందులో హాస్టల్ నిర్వహించాలని సూచించారని, ఈ మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.










