Jul 07,2023 23:20

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి నగరపాలక సంస్థ పరిధిలో ప్రజారోగ్యాన్ని కాపాడే విషయంలో కీలక భూమిని పోషిస్తూ వారి ఆరోగ్యాలను పణంగా పెడుతూ సేవలు అందిస్తున్న క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ (క్లాప్‌) డ్రైవర్లకు కనీస వేతనాలు కరువయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ్‌ సంకల్ప్‌లో భాగంగా నియమాకాలు చేపట్టిన క్లాప్‌ వెహికల్‌ డ్రైవర్ల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం, అధికారులు నిమ్మకునిరోత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కాకినాడ కార్పోరేషన్‌ పరిధిలో 105 మంది క్లాప్‌ డ్రైవర్లు పని చేస్తున్నారు. వీరంతా రోజులో 10 నుంచి 12 గంటల పాటు కష్టపడుతూ ఇంటింటికీ వెళ్లి తడి, పొడి చెత్త సేకరణలో పాల్గొంటున్నారు. నగరపాలక సంస్థ అధికారులు అప్పగించిన పనిని తుచ తప్పకుండా అమలు పరుస్తున్నారు. అయితే వారికి జిఒ ప్రకారం వీరికి కనీస జీతాలు ఇవ్వడం లేదు.
రాష్ట్ర ప్రభుత్వం డ్రైవర్లకు రూ.12,500 చెల్లిస్తోంది. ఇందులో వివిధ కటింగ్‌లు పోగా రూ.10 వేలు మాత్రమే మిగులుతుంది. ప్రస్తుతం నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో సామాన్య కుటుంబానికి సైతం రూ.20 వేల ఆదాయం ఉంటేనే గాని గడవని పరిస్థితి నెలకొంది. రూ.10 వేలతో కుటుంబ పోషణ, పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పెట్రోలు, గ్యాస్‌, ఇటీవల పెరిగిన విద్యుత్‌ ఛార్జీల భారం మోయలేకుండా ఉన్నామని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిఒ 7 ప్రకారం రూ.18,500 వేతనాలు చెల్లించాలని కోరుతున్నారు. వారంతపు సెలవులు లేకపోవడంతో విశ్రాంతి తీసుకునే అవకాశం కూడా ఉండడం లేదని వాపోతున్నారు. ఒక వేళ జీతం కట్‌ చేసి సెలవు ఇవ్వాలని కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ తెలిపారు. అనారోగ్యం చేసినా, అత్యవసర పనులు వచ్చినా సెలవులు లభ్యం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొంత పనులు చేసుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. ఇన్సురెన్సు సౌకర్యం లేకపోవడంతో భవిష్యత్తుపై బెంగ వెంటాడుతుందని తెలిపారు.
ఇఎస్‌ఐ సౌకర్యం లేక ఆరోగ్య సమస్యలు వస్తే ప్రైవేటు ఆసుపత్రుల్లో ఫీజులు చెల్లించలేక, మందులు ఖర్చులు భరించలేక అప్పుల పాలవుతున్నట్లు తెలిపారు. పిఎఫ్‌ కూడా లేక తీవ్రస్థాయిలో ఇబ్బందులకు గురవుతున్నారు.
కొన్ని సందర్భాల్లో అధికారులు తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నారు. కాంట్రాక్ట్‌ దోపిడీ వ్యవస్థ లేకుండా ఆప్కాస్‌ను తెచ్చిన ప్రభుత్వం జిఒ 136 తెచ్చాక, మరలా క్లాప్‌ డ్రైవర్ల వ్యవస్థలో కాంట్రాక్టర్‌ను పెట్టడం సమంజసంగా లేదని సిఐటియ నాయకులు పేర్కొన్నారు. కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వాయిదాలు వేస్తూ వస్తున్నారని చెప్పారు. డ్రైవర్ల పట్ల బెదిరింపులు, వేధింపులు ఎక్కువవుతున్నాయన్నారు. కార్మికుల జీతాల నుంచి పిఎఫ్‌, ఇఎస్‌ఐని కాంట్రాక్టర్‌ కోత పెడుతూ ఆయా సంస్థలకు జమ చేయడం లేదన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపల్‌ శాఖ బాధ్యత తీసుకుని యూనియన్‌ నాయకులతో చర్చించి తమ సమస్యలు పరిష్కరించాలని డ్రైవర్లు డిమాండ్‌ చేస్తున్నారు. లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.