ప్రజాశక్తి-కాకినాడ అసెంబ్లీ నియోజకవర్గ సమీక్షా సమావేశాల్లో చర్చించిన ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం అందించేందుకు మిషన్ మోడ్ శైలిలో పని చేయాలని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, రాష్ట్ర పశ సంవర్థక, పాడిపరిశ్రమ మత్స్యశాఖల మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అధికారుకు సూచించారు. శనివారం జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గ సమీక్షా సమావేశం మంత్రి సీదిరి అప్పలరాజు అధ్యక్షతన కలెక్టరేట్‌లోని విధాన గౌతమి సమావేశ హాల్లో నిర్వహించారు. ఎంపీ వంగా గీత, జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు, జగ్గంపేట ఎంఎల్‌ఎ జ్యోతుల చంటిబాబు, జగ్గంపేట, కిర్లంపూడి, గండేపల్లి మండలాల ఎంపిపిలు, జెడ్‌టిసిలు, మండల అధికారులు ఈ సమావేశంలో పాల్గొని నియోజకవర్గంలో వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి అప్పలరాజు మాట్లాడు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో సమస్యలను స్థానిక ఎంఎల్‌ఎ, జిల్లా కలెక్టర్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధుల సమిష్టిగా చర్చించి, వాటికి తక్షణ పరిష్కార చర్యలు చేపట్టేందుకు ప్రతి శనివారం జిల్లాలో ఎంపిక చేసిన ఒక నియోజకవర్గంలో సమీక్ష నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. ఇందులో భాగంగా కాకినాడ జిల్లాలో తొలి సమావేశంగా నిర్వహించిన జగ్గంపేట నియోజకవర్గ సమీక్ష అత్యంత ప్రయోజనకరంగా జరిగిందని, ప్రజలు ఎదుర్కొంటున్న సూమారు 23 ప్రధాన సమస్యలను గుర్తించినట్టు చెప్పారు. వీటి పరిష్కారం కోసం ఆయా శాఖల జిల్లా, డివిజన్, మండల అధికారులు సోమవారం నిర్ధిష్ట కార్యాచరణ నివేదకలను జిల్లా కలెక్టర్ కు సమర్పించాలని సూచించారు. శనివారం జరిగిన సమీక్షలో చర్చించిన సమస్యల్లో అత్యధిక అంశాలు నిధులు అవసరం లేకుండా అధికారుల సమన్వయంతో పరిష్కరించగలవే ఉన్నాయన్నారు. ఆయా శాఖలు సమిష్టిగా త్వరితగతిన వాటిని పరిష్కరించాలన్నారు. గతంలో రహదారుల నిర్వహణను నిర్లక్షం చేయడం వల్ల, పుష్కలంగా కురుస్తున్న వర్షాల వల్ల రోడ్లు దెబ్బ తిన్నాయని, వాటి పునరుద్దరణకు అవసరమైన నిధులు ప్రభుత్వం మంజూరు చేస్తోందన్నారు. జగ్గంపేట నియోజక వర్గ పరిధిలో రోడ్ల అభివృద్ధి, మరమ్మతుల కోసం ఇటీవలే రూ.5 కోట్ల 70 లక్షలు నిధులు మంజూరు చేసిందన్నారు. టెండర్ల ప్రకియ వెంటనే పూర్తి చేసి, పనులు సత్వరం చేపట్టాలని ఆర్ అండ్ బి అధికారులకు సూచించారు. అభివద్ది పనుల నిర్వహణకు ప్రతి గ్రామ పంచాయితీకి రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయలు నిధులు కేటాయించిదని, వీటితో పాటు నాడు-నేడు, మహాత్మాగాంధీ ఉపాధి హామీ పధకం క్రింద పనులు అన్ని పంచాయితీల్లో విస్తతంగా జరుగుతున్నాయన్నారు. పిల్లల చదువు కోసం, కుటుంబ సభ్యుల వైద్యం కోసం అప్పులు పాలైయ్యే పరిస్థితి రాకుండా ప్రభుత్వం ప్రజలకు అండగా నిలుస్తోందని, ప్రభుత్వం అమలు చేస్తున్న ఆదర్శనీయమైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజాప్రతినిదులు ప్రజలకు వివరించాలని కోరారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ ప్రఖర్ జైన్, జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి పి.త్రినాథ్, పెద్దాపురం ఆర్‌డిఒ జె.సీతారామారావు, తహశీల్దార్లు పాల్గొన్నారు.










