Feb 20,2023 23:44

వినతులు స్వీకరిస్తున్న జాయింట్‌ కలెక్టర్‌ శివ శ్రీనివాస్‌

స్పందనలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ శివశ్రీనివాస్‌
ప్రజాశక్తి - రంపచోడవరం
: స్పందనలో మన్యంలోని మారుమూల గ్రామాల నుంచి వచ్చిన వ్యక్తిగత, సామాజిక సమస్యల అర్జీల సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అల్లూరి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ శివశ్రీనివాస్‌ అన్నారు. సోమవారం స్థానిక ఐటిడిఏ సమావేశపు మందిరంలో రంపచోడవరం ఐటిడిఎ ప్రాజెక్ట్‌ అధికారి అధికారి సూరజ్‌ గనోరే, సబ్‌ కలెక్టర్‌ శుభం బన్సల్‌, ఐటిడిఎ ఎపిఒ జనరల్‌ సిహెచ్‌ శ్రీనివాసరావులతో కలిపి స్పందన కార్యక్రమం నిర్వహించి, ప్రజల నుంచి వినతులు స్వీకకరించారు.
ఈ సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ శివశ్రీనివాస్‌ మాట్లాడుతూ స్పందనలో 26 దరఖాస్తులు రాగా, మారుమూల గ్రామాల అర్జీదారుల వినతులను అనేక అక్కడికక్కడే పరిష్కరించామని, మిగిలిన వాటిని సంబంధిత అధికారులకు రిఫర్‌ చేసి తక్షణ చర్యలకు ఆదేశించి, చర్యానివేదికలను వెల్లడించాలని సూచించారు.
కొయ్యూరు మండలం మఠం భీమవరం సచివాలయ పరిధిలో పోతవరం గ్రామంలో ఏళ్ల తరబడి సాగులో ఉన్న భూములకు సర్వే నిర్వహించి, పట్టాలు మంజూరు చేయాలని పంగి నరసింహారావు. గొల్లూరి విజరు, పంగి లీలావతి దరఖాస్తు సమర్పించారు. అడ్డతీగల మండలకేంద్రంలో ప్రభుత్వ భూములను గిరిజనేతరులు ఆక్రమించుకున్నారని, దానిపై తగు చర్యలు తీసుకోవాలని గంగవరానికి చెందిన కుంజం చిన్నారావు దరఖాస్తు సమర్పించారు. 516ఇ నేషనల్‌ హైవే నిర్మాణంలో కోల్పోతున్న 99 సెంట్లు భూమికి తమ కుటుంబంలోని ఏడుగురు సభ్యులకు సమానంగా నష్టపరిహారం ఇప్పించాలని రాజవొమ్మంగి మండలం దూసరపాము గ్రామానికి చెందిన కె.రామలక్ష్మి దరఖాస్తు సమర్పించారు, పోలవరం ప్రాజెక్టులో ముంపునకు గురైన తన 12ఎకరాలకు సరిపడా భూమిని వేరొక చోట ఇప్పించాలని టి. సుబ్బారావు అనే గిరిజనులు దరఖాస్తు సమర్పించారు. విద్యుత్‌ షాక్‌తో చేయిని కోల్పోయిన తన కుమారుడు టి.భరద్వాజ్‌కు ప్రభుత్వపరంగా ఆర్థికసాయం చేసి ఆదుకోవాలని గంగవరం మండలం నెల్లిపూడి గ్రామానికి చెందిన తుపాటి నాగలక్ష్మి దరఖాస్తు సమర్పించారు,
స్పందనలో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ డిఎన్‌ శాస్త్రి, ఇఇలు నాగేశ్వరరావు, ఎండి యూసఫ్‌, వెలుగు ఎపిడి ఎ. శ్రీనివాసరావు, ఎడిఎంహెచ్‌ఒ డాక్టర్‌ అనూష, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కల్పన, డాక్టర్‌ రాధిక, వెటర్నరీ డాక్టర్‌ గోపిక, జిసిసి మేనేజర్‌ యం.నాగరాజారెడ్డి, డిఇఇలు సాయి సతీష్‌, దుర్గాప్రసాద్‌, రాజేంద్ర బాబు, పిఎఒ రాంబాబు.ఎ డిఎసిహెచ్‌ కెవి.చౌదరి, సావిత్రి, గిరిజన సంక్షేమ శాఖ డిడి కార్యాలయ సూపరింటెండెంట్‌ బి. కిషోర్‌, డివిజినల్‌ సివిల్‌ సప్లై అధికారి సి. శ్రీహరి. డిప్యూటీ సబ్‌ కలెక్టర్‌ కార్యాలయ పరిపాలనాధికారి ఎం.సావిత్రి. సిడిపిఒ సంధ్యారాణి. ఎస్‌ఒ కబోది. మత్స్యశాఖ అధికారి రమేష్‌. ఎఇ ఎంవి.సత్యనారాయణ డిపిఎం అపర్ణ పాల్గొన్నారు,