ప్రజాశక్తి-పాడేరు:రాష్ట్రంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో అనేక సమస్యలు పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నక్క వెంకటేశ్వర్లు తెలిపారు. గత మూడేళ్లుగా విద్యా రంగంలో నెలకొన్న సమస్యల్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళితే పరిష్కరించలేదన్నారు. స్థానిక విలేకరుల సమావేశంలో శనివారం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఇటీవల రాష్ట్రంలోని అన్ని ఐటీడీఏల పరిధిలో యుటిఎఫ్ నిర్వహించిన జీపు జాతాల ద్వారా క్షేత్రస్థాయిలో అనేక సమస్యలు వచ్చాయని చెప్పారు. వీటి పరిష్కార నిమిత్తం ఈనెల 20న పాడేరులో విద్యా సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. గిరిజన ఆశ్రమాల్లో విద్యార్థులు అర్ధాకలితో చదువులు సాగిస్తున్నారని, 2019 నుంచి మెస్ ఛార్జీలను ప్రభుత్వం పెంచలేదని చెప్పారు. విద్యార్థులకు కాస్మోటిక్ ప్రభుత్వం సరఫరా చేయలేదని తెలిపారు. విద్యార్థులకు ఐదు జతలకు గాను రెండు జతలే ప్రభుత్వం ఇస్తుందన్నారు. ఆశ్రమాల్లో హెల్త్ వాలంటీర్లు, ఏఎన్‌ఎంలను నియమించక పోవడంతో పిల్లలకు అనారోగ్యం వస్తే ఉపాధ్యాయులే ఆసుపత్రులకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నారు. గిరిజన బాలిక ఆశ్రమాల్లో ప్రహరీలు లేవని చెప్పారు.
గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో సగం మంది సీఆర్టీలే ఉన్నారని, వీరికి ప్రభుత్వం ఏడాదికి 10 నెలలకే జీతం ఇస్తోందని ఆయన చెప్పారు. జీవో 3ని పునరుద్ధరించాలన్నారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలోని ఉపాధ్యాయులను మండల విద్యాశాఖ అధికారులుగా నియమించి, ఖాళీగా ఉన్న పాడేరు, పార్వతీపురం, సీతంపేట ఐటిడిఎల్లో డిప్యూటీ డీఈవో పోస్టులను అర్హులైన గిరిజన ఉపాధ్యాయులకే పదోన్నతుల కల్పించాలని డిమాండ్ చేశారు. 524 పండిట్, పిఈటి పోస్టులను అప్‌గ్రేడేషన్ చేయాలని చెప్పారు. గిరిజన ప్రాంతంలో భాష వాలంటీర్ల నియామకంపై అల్లూరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చొరవ తీసుకున్నప్పటికీ ఐటిడిఏ పిఓ గోపాలకృష్ణ అభ్యంతరాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. గిరిజన ప్రాంతంలో భాష వాలంటీర్ల నియమాకం ఆవశ్యమని చెప్పారు. జిల్లా కలెక్టర్ చెప్పినా పీవో స్పందించక పోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైతే తాము భాష వాలంటీర్లతో ఐటీడీఏను ముట్టడిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలోని గిరిజన సంక్షేమ విద్యా రంగ సమస్యల పరిష్కారం కోసం ఈనెల 20న పాడేరులో రాష్ట్ర విద్యా సదస్సు నిర్వహిస్తున్నట్లు యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఈ సదస్సు పోస్టర్లను ఆయన జిల్లా నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ అల్లూరి జిల్లా ప్రధాన కార్యదర్శి మహేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు వై.విల్సన్ బాబు, సహా అధ్యక్షురాలు కవిత, గౌరవ అధ్యక్షుడు టి.చిట్టిబాబు, కార్యదర్శులు పి.కృష్ణయ్య, కె.రఘునాధ్, వెంకట నారాయణ, ఆడిట్ కమిటీ కన్వీనర్ ఎస్.నాగేశ్వరరావు,సిపిఎస్ సబ్ కమిటీ ఎల్.నారాయణ, సీనియర్ నాయకులు ఎస్.రాంబాబు, పి.దేముడు, కర్రి బాబు, ఎన్.కొండబాబు పాల్గొన్నారు.










