ప్రజాశక్తి -భీమునిపట్నం. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు సూచించారు. శుక్రవారం ఎంపిపి డివిఎస్‌ఎస్‌ఎన్ రాజు అధ్యక్షతన మండల పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన సాధారణ సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతూ, తాగునీరు, విద్యుత్, పారిశుధ్య సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. సచివాలయ ఉద్యోగులు, సిబ్బంది, స్థానిక ప్రజా ప్రతినిధులు సమన్వయం చేసుకుని పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ఈ సందర్భంగా శాఖల వారీగా ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. జెడ్‌పిటిసి గాడు వెంకటప్పడు, వైస్ ఎంపిపిలు బోని బంగారు నాయుడు, సురపతి దుర్గాలమ్మ, ఎఎంసి చైర్మన్ యలమంచిలి సూర్య నారాయణ పాల్గొన్నారు.
అధికార్లు బాధ్యతగా పనిచేస్తే అభివృద్ధి
పద్మనాభం: అధికారులు బాధ్యతాయుతంగా పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యపడుతుందని ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్‌లో ఎంపిపి కె.రాంబాబు అధ్యక్షతన నిర్వహించిన మండల సమావేశంలో శాఖలవారీగా అధికారులు నివేదికలను వెల్లడించిన తర్వాత అధికారులు, ఎంపిటిసిలు, సర్పంచ్‌లతో సమీక్షించారు. ఆర్‌బికెలు, వెల్‌నెస్ సెంటర్లు, పాలకేంద్రం నిర్మాణాలపై వివరించాలని ఎఇ సుధాకర్‌ను ఎమ్మెల్యే అదేశించారు. వ్యవసాయశాఖకు సంబంధించి ప్రధానమైన సమస్యలున్న నేపథ్యంలో వాటిపై సంబంధిత అధికారులతో చర్చించడానికి అధిక ప్రాధాన్యతనివ్వకుండా ఇతర విషయాలపై చర్చించడం సరికాదని పలువురు సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్ధేశించిన సమయం కన్నా 1.15గంటలు ఆలస్యంగా సమావేశం ప్రారంభం కావడంతోపాటు అన్ని విషయాల్లోనూ ప్రసంగాల ధోరణి వల్ల పూర్తిస్థాయిలో చర్చించడానికి వీలు లేకుండా పోయిందని పలువురు సభ్యులు వాపోయారు. సమావేశంలో జెడ్‌పిటిసి సుంకర గిరిబాబు, వైస్ ఎంపిపి ఈర్ల రాజేశ్వరి, కోరాడ సర్పంచ్ కె లక్షణరావు, ఎంపిడిఒ నిర్మలాదేవి, ఇఒపిఆర్‌డి ఉషారాణి, సూపరింటెండెంట్ రాధ, ఎంపిటిసిలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.










