ప్రజాశక్తి - సాలూరు : ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.రామ్మోహన్ అన్నారు. జిల్లా విద్యారంగం అభివృద్ధికై ఎస్‌ఎఫ్‌ఐ చేపట్టిన విద్యార్ధి సంగ్రామ సైకిల్ యాత్ర మంగళవారం పట్టణానికి చేరింది. పట్టణంలో ప్రభుత్వ, ప్రయివేటు కళాశాల విద్యార్థులతో కలిసి ప్రధాన రహదారి మీదుగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం బోసుబొమ్మ జంక్షన్ లో విద్యార్ధులను ఉద్దేశించి రామ్మోహన్ మాట్లాడుతూ గత ఎన్నికల ముందు సిఎం జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు. టిడిపి పాలనలో రాష్ట్రం నాశనమైందని, తాను అధికారంలోకి వస్తే అన్ని వర్గాల సమస్యలు పరిష్కరిస్తానని చెప్పారని తెలిపారు. రాష్ట్ర విభజనలో భాగంగా రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హౌదా కోసం పోరాడకుండా కేంద్రంలో బిజెపితో వైసిపి దోస్తీ చేస్తోందని చెప్పారు. టిడిపి, జనసేన, వైసిపిలు బిజెపితో అంటకాగుతున్న కారణంగా ప్రధాన సమస్యలు పరిష్కారం కాలేదని చెప్పారు. గడచిన నాలుగేళ్లలో విద్యార్థుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయని చెప్పారు. విభజన హామీలో భాగంగా మంజూరైన గిరిజన యూనివర్సిటీ శంకుస్థాపనలకే పరిమితమైంద న్నారు. టిడిపి హయాంలో కొత్తవలసలో యూనివర్సిటీకి శంకుస్థాపన చేస్తే వైసిపి ప్రభుత్వం మెంటాడ, దత్తిరాజేరు మండలాల సరిహద్దు ప్రాంతంలో శంకుస్థాపన చేసిందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో ప్రభుత్వం మారితే యూనివర్సిటీ ఎక్కడికి వెళ్తుందో చెప్పలేమని అన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పి.రాజశేఖర్ మాట్లాడుతూ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేవని చెప్పారు. పెండింగులో ఉన్న ఆశ్రమ పాఠశాలల డైట్ ఛార్జీల బిల్లులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఆశ్రమ పాఠశాలల్లో ఎఎన్‌ఎంలను నియమించాలని కోరారు. ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. డిఎస్సీ నిర్వహించాలని కోరారు. కార్యక్ర మంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు డి.పండు, డివిజన్ కమిటీ నాయకులు పాల్గొన్నారు.










