Aug 30,2023 22:33

ప్రజశక్తి - చీరాల 
పట్టణంలో ప్రజలు ఎదుర్కొనే మౌళిక సమస్యలు పరిష్కారం చేయడంలో పురపాలకులు విఫలమయ్యారని సిపిఎం పట్టణ కార్యదర్శి నలతోటి బాబురావు ఆరోపించారు. స్థానిక పేరాలలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికైన 33మంది వార్డు కౌన్సిలర్లు అందరూ ఒకే ప్రతిపక్షం కావడంతో ప్రజా సమస్యలపై కనీస ప్రస్తావన చేయడంలేదని అన్నారు. వాళ్ల ప్రయోజనాలు ఉన్న అంశాలను ఎలాంటి చర్చ లేకుండా ఆల్‌ పాస్‌ చేసుకుంటూ ప్రజల సమస్యలను కనీసం చర్చకు కూడా రానివ్వడంలేదని అన్నారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన నిధులు రాబట్టడంలో పురపాలకులు విఫలమయ్యారని అన్నారు. ఎంతో కాలంగా పట్టణంలో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉంది. రూ.వందల కోట్లు ఖర్చు చేసినప్పటికీ డ్రైనేజీ సమస్య పరిష్కారం కావడంలేదు. నీటిపారుదలకు వాలుగా ఉన్న వైపు కాకుండా ఎగువకు కాలువల నిర్మాణం చేసి శాశ్వత మురుగునీటి ఎత్తిపోతల పథకాలతో మున్సిపాలిటీకి నిర్వహణ భారంగా మారిందనేది గుర్తించాలని అన్నారు. రైలు పట్టాలకు పడమర వైపు ఉండే ప్రజలు వర్షకాలంలో నీళ్లుపోక దోమలు చేసి అంటువ్యాధులు, విషజ్వరాలతో అవస్థలు పడే పరిస్థితి ఉందన్నారు. కుందేరు అభివృద్ది చేసి నీటిపారుదల ఉండే విధంగా చేస్తే పట్టణ మురుగునీటి సమస్యకు పరిష్కారం దొరుకుతుందని తాము సూచిస్తున్నట్లు తెలిపారు. పట్టణంలో పారిశుద్యం పడకేసిందన్నారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా పారిశుద్ధ్య కార్మికుల సంఖ్య పెంచలేదన్నారు. ఇళ్లులేని పేదలకు స్థలం ఇవ్వడంలో విఫలమైందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న కాలనీలు సెంటు స్థలం ఇచ్చినప్పటికీ చీరాల పట్టణంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో వైఫల్యం కనిపిస్తుందన్నారు. ఇళ్లస్థలాలు, మురుగునీటి సమస్యలు పురపాలకులకు సవాలుగా మారాయని అన్నారు. కుందేరుని ఆక్రమణ దారులనుండి కాపాడలేకపోతున్నారని అన్నారు. ఆక్రమణ దారులకు సహకరిస్తున్నారనే ఆరోపణలకు పురపాలకులే సమాధానం చెప్పాల్సి ఉందన్నారు. పట్టణ నడిబొడ్డులో పురపాలక స్థలం ఆక్రమించి కట్టడాలు కట్టినాకూడా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. మున్సిపల్‌ నిధులతో అంబేద్కర్‌ కాంస్య విగ్రహ నిర్మాణంలో అంబేద్కర్‌వాదులను పరిగణలోకి తీసుకోకపోవడం ఏకపక్ష ధోరణికి నిదర్శనమని అన్నారు. పట్టణ అభివృద్దికి అవసరమైన నిధులు రాబట్టేందుకు ఐక్యంగా కృషి చేయాలని కోరారు. సమావేశంలో సిపిఎం నాయకులు ఎం వసంతరావు, ఎల్ జయరాజు పాల్గొన్నారు.