ఆత్మకూరు, బెళుగుప్ప : ప్రజా, రైతు, కార్మిక సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం అయ్యాయని సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ విమర్శించారు. వెనుకబడిన అనంతపురం జిల్లా సమగ్రాభివృద్ధి కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజారక్షణ భేరి స్కూటర్‌యాత్ర బుధవారం 3వ రోజు పలు మండలాల్లో కొనసాగింది. కళ్యాణదుర్గం, ఆత్మకూరు, కూడేరు, బెళుగుప్ప, గార్లదిన్నె, రాప్తాడు మీదుగా రాత్రికి అనంతపురం చేరుకుంది. ఆత్మకూరులో నిర్వహించిన కార్యక్రమంలో రాంభూపాల్ మాట్లాడుతూ జిల్లాలో సాగునీటి వనరులు కల్పించడంలో పాలకులు పూర్తిగా విఫలం అయ్యారన్నారు. తుంగభద్ర హెచ్‌ఎల్‌సి కాలువల కింద నిర్ణయించిన ఆయకట్టు భూములకు ఇప్పటివరకు పూర్తి స్థాయిలో నీరు అందించకుండా ప్రజా ప్రతినిధులు కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. రాప్తాడు నియోజకవర్గంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా లక్ష ఎకరాలకు సాగును ఇస్తామని ఇచ్చిన హామీలు నేటికీ అమలుకు నోచుకోలేదన్నారు. రైతులు పండించిన పంటలకు మార్కెట్ సౌకర్యం లేదన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లేవన్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందన్నారు. వర్షాభావంతో పంటలను పూర్తిగా నష్టపోతే ఆదుకోవాల్సిన ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచాకరం అన్నారు. కరువు సహాయక చర్యలు చేపట్టి ఎకరాకు రూ.50 వేల పంట నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉపాధి పనులను 200 రోజులకు పెంచి రోజుకు 600 రూపాయల కూలి ఇవ్వాలన్నారు. డ్రిప్, స్ప్రింక్లర్లను 90 శాతం సబ్సిడీతో ఇవ్వాలన్నారు. భూమి లేని నిరుపేదలకు రెండు ఎకరాల సాగుభూమి ఇవ్వాలని కోరారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి వారికి పంట రుణం, పంట నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ పంప్ సెట్లకు మీటర్లు బిగించే విధానాన్ని తక్షణం విరమించుకోవాలన్నారు. పంటలు పూర్తయ్యేవరకు హంద్రీనీవా, కాలవల ద్వారా రైతులకు సాగునీరు ఇవ్వాలన్నారు. పరిశ్రమలను ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాల కల్పించాలన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. వీటితో పాటు ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ సనవంబర్ 15న చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందులో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి సభ్యులు బాలరంగయ్య, జిల్లా కమిటీ సభ్యులు ఎస్.నాగేంద్రకుమార్, చంద్రశేఖర్‌రెడ్డి, కృష్ణమూర్తి, రంగారెడ్డి, నాగమణి, అచ్యుత్‌ప్రసాద్, మర్రి చెన్నారెడ్డి, ఎస్‌ఎఫ్‌ఐ శివ, సిఐటియు నాయకులు భీమన్న, పాతన్న, మారెన్న, నరసింహులు, ముత్యాలరెడ్డి, వెంకటేశులు, ఆత్మకూరు మండల కార్యదర్శి శివ శంకర్, మధ్యాహ్నం భోజనం జిల్లా సహాయ కార్యదర్శి జయమ్మ, ఆత్మకూరు రైతు సంఘం మండల కార్యదర్శి రాము, ఆవాజ్ మండల కార్యదర్శి వలీ, ఐద్వా మండల కార్యదర్శి రాజేశ్వరమ్మ, వెంకటమ్మ, కళ్యానదుర్గం నాయకులు నాగమణి, రఘు, రంగనాథ్, భవిత, సిద్దప్ప, అశోక్, నాగరాజు, ఈశ్వర్, కార్తీక్, వంశీ, దనుష్ పాల్గొన్నారు.
పేదల ఇళ్లు కూలుస్తున్నా స్పందించరా..?
గార్లదిన్నె : నిరుపేదల ఇళ్లు కూలుస్తున్నా జిల్లాలో ఎమ్మెల్యేలు ఎంపీలు స్పందించారని రాంభూపాల్ ప్రశ్నించారు. గార్లదిన్నెలో జరిగిన స్కూటర్‌యాత్రలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎమ్మెల్యేలకు భూకబ్జాలు, ప్రభుత్వ భూమి కొల్లగొట్టుటపై ఉన్న శ్రద్ధ ప్రజలు, రైతులు, కార్మిక సమస్యల పరిష్కారంపై లేదన్నారు. ప్రజా, రైతు, కార్మిక సమస్యల పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విపలమైందన్నారు. గార్లదిన్నె మండలంలో పేద నిరుపేద రైతులు ఎకరం, అరెకరం భూమిని సాగు చేసుకుంటే వాటికి పట్టాలు ఇవ్వని అధికారులు, అధికార పార్టీ నాయకులు ఎకరాలకు ఎకరాలు ఆక్రమించుకుంటే వాటికి పట్టాల మంజూరు చేస్తున్నారని తెలిపారు. అధికార పార్టీ నాయకులు మండల కేంద్రంలోని 456 సర్వే నెంబర్‌లో ఆరు ఎకరాల భూమిని బినామీ పేర్లు ద్వారా తప్పుడు డాక్యుమెంట్ల సష్టించి కాజేసారన్నారు. దీనిపై చర్యలు తీసుకోమని ఆర్డీవో ఉన్నతాధికారులకు సిఫారసు చేయగా ఆర్డీవోను నిర్దాక్షిణ్యంగా బదిలీ చేశారన్నారు. కల్లూరు గ్రామంలో పేదలు నిర్మించుకున్న 150 గుడిసెలను మానవత్వం మరిచి కూల్చేసారన్నారు. అదే సర్వే నెంబర్లో అధికార పార్టీ నాయకులు కట్టుకున్న ఇళ్లను అలాగే ఉంచారన్నారు. ప్రభుత్వం పేదల పక్షమో కబ్జాదారుల పక్షమో అర్థం కాని పరిస్థితి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు తరిమెల నాగరాజు, సిపిఎం మండల కార్యదర్శి మండల కార్యదర్శి చెన్నారెడ్డి, నల్లప్ప, నాగేంద్ర, చంద్రశేఖర్ రెడ్డి, నాగమ్మ, రాముడు, మల్లికార్జున పాల్గొన్నారు.