Sep 22,2023 01:09

ప్రజాశక్తి - బాపట్ల
రాష్ట్రంలో సర్పంచుల సమస్యలు పరిష్కారం చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎపి సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు చిలకలపూడి పాపారావు అన్నారు. పట్టణంలోని పుచ్చలపల్లి సుందరయ్య కార్యాలయంలో జరిగిన సర్పంచుల సంక్షేమ సంఘం జిల్లా విస్తృ స్థాయి సమావేశం గురువారం నిర్వహించారు. సమావేశానికి కర్లపాలెం మండలం పెదపులుగు వారిపాలెం పంచాయతీ సర్పంచి అక్కల శ్రీనివాసరెడ్డి అధ్యక్షత వహించారు. పాపారావు మాట్లాడుతూ భవిష్యత్తులో సర్పంచులకు హక్కులు, విధులు కల్పించకపోతే రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని అన్నారు. సర్పంచుల పట్ల ప్రభుత్వం సవితితల్లి ప్రేమ చూపుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా సర్పంచుల సమస్యలు తీర్చడంలో విఫలమైందన్నారు. భవిష్యత్తులో పార్టీలకతీతంగా సర్పంచులు ఐక్యమత్యంగా ఉద్యమిస్తామని అన్నారు. ఇప్పటికైనా  సిఎం వైఎస్‌ జగన్‌ చొరవచూపించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక పంచాయితీల్లో వర్షాకాలంలో బ్లీచింగ్ కొట్టించడానికి కూడా నిధులు లేవని అన్నారు. సర్పంచుల గౌరవ వేతనం రూ.3వేల నుండి రూ.15వేలకు పెంచాలని కోరారు. మైనర్ పంచాయతీల విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే భరించాలని అన్నారు. పంచాయతీలో పనిచేసి గ్రీన్ గార్డ్, గ్రీన్ అంబాసిడర్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే జీతాలు ఇవ్వాలని అన్నారు. సచివాలయాల్లో వచ్చే ఆదాయాలను పంచాయతీలకు జమ చేయాలని కోరారు. సచివాలయా వ్యవస్థపై సర్పంచులకు అజమాయిషి ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. అఖిల భారత పంచాయతీ పరిషత్ ఉపాధ్యక్షులు జాస్తి వీరాంజనేయులు మాట్లాడుతూ స్వాతంత్యానంతరం ఎన్నడూ లేని విధంగా ఈ ప్రభుత్వాలు వచ్చాక సర్పంచులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఉన్న 29అంశాలను అమలు చేయడంలో విఫలమయ్యాయన అన్నారు. కేరళ ప్రభుత్వం తరహాలో పంచాయతీలకు నేరుగా నిధులు ఇస్తే గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పెండింగులో ఉన్న 15వ ఆర్థిక సంఘం నిధులు వెంటనే విడుదల చేయాలని కోరారు. 


సర్పంచుల సంఘం జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

బాపట్ల జిల్లా సర్పంచుల సంఘం జిల్లా నూతన కార్యవర్గం ఎన్నుకున్నారు. జిల్లా నూతన అధ్యక్షుడిగా నిజాంపట్నం మండలం అడవులదీవి సర్పంచి శొంఠి శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శిగా కర్లపాలెం మండలం పెద పులుగువారిపాలెం సర్పంచి అక్కల శ్రీనివాసరెడ్డితోపాటు మరో 15మందితో కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సర్పంచుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి టి కృష్ణమోహన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉయ్యూరు అప్పరెడ్డి, దాది రాజ్యలక్ష్మి సుబ్బారావు, మబ్బు సుధాకర్, సర్పంచుల సంక్షేమ సంఘం నాయకులు మేకతోటి శ్రీకాంత్, రుద్రపాటి బుజ్జిబాబు, పిల్లి బాబ్జి, వై అశ్విని, జి వెంకటేశ్వరావు, మద్దిరాల వందనం, బి హనుమాన్ పాల్గొన్నారు.