ప్రజాశక్తి - పాడేరు : గిరిజన విద్యారంగ సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని పలువురు వక్తలు అన్నారు. గిరిజన విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఆదివారం పాడేరు కాఫీ హౌస్‌లో యుటిఎఫ్ ఆధ్వర్యాన నిర్వహించిన రాష్ట్ర స్థాయి విద్యా సదస్సు విజయవంతమైంది. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి యుటిఎఫ్ ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు అధిక శాతం మహిళా ఉపాధ్యాయినిలు తరలివచ్చారు. పాడేరు ఐటిడిఎ నుంచి కాఫీ హౌస్ వరకూ ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని పిడిఎఫ్ ఎమ్మెల్సీలు షేక్ సాబ్జీ, ఐ.వెంకటేశ్వరరావు ప్రారంభించారు. గిరిజన ఉపాధ్యాయ, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ర్యాలీలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జిఒ నెంబర్ 3ని పునరుద్ధరించాలని, సిఆర్‌టిలను రెగ్యులర్ చేయాలని, పిఇటి, పండిట్ పోస్టులను అప్‌గ్రేడ్ చేయాలని, గిరిజన ఉపాధ్యాయులకు ప్రమోషన్లు కల్పించాలని, భాషా వాలంటీర్లను రెన్యువల్ చేయాలని, ఆశ్రమ పాఠశాలల్లో బోధనేతర సిబ్బందిని నియమించాలని నినదించారు. ర్యాలీ అనంతరం కాఫీ హౌస్ ప్రాంగణంలో జరిగిన విద్యా సదస్సుకు సుమారు 700 మంది ఉపాధ్యాయులు హాజరయ్యారు. గిరిజన విద్యారంగ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం తీరును పిడిఎఫ్ ఎమ్మెల్సీలు, యుటిఎఫ్ రాష్ట్ర, పలు జిల్లాల నేతలు ఎండగట్టారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు సరఫరా చేసే కాస్మోటిక్ ఛార్జీలను అమ్మ ఒడి పథకం సాకుతో రెండేళ్ల నుంచి పంపిణీ చేయకపోవడంపై మండిపడ్డారు. ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం లేదంటూ మండిపడ్డారు. పాడేరు ఐటిడిఎ పరిధిలో భాషా వాలంటీర్లను నియమించకుండా పిఒ అడ్డుపుల్ల వేస్తున్నారని తెలిపారు. సదస్సులో యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్.వెంకటేశ్వర్లు, ప్రసాద్, గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర, నాయకులు పి.అప్పలనర్స, యుటిఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి పి.మహేష్, నాయకులు తోట రమేష్, ఎస్.నాగమణి, పి.విల్సన్‌బాబు, చౌదరి రవీంద్ర, ఎస్.మురళీమోహన్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
పిడిఎఫ్ అభ్యర్థి రమాప్రభ గెలుపునకు కృషి
రానున్న ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పిడిఎఫ్ అభ్యర్థి కె.రమాప్రభను గెలిపించడమే ఉపాధ్యాయుల కర్తవ్యంగా భావించి అందరూ కృషి చేయాలని ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు, యుటిఎఫ్ రాష్ట్ర నాయకులు పిలుపునిచ్చారు. పాడేరు కాఫీ హౌస్‌లో జరిగిన విద్యా సదస్సునకు రమాప్రభ హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చట్ట సభల్లో ఉపాధ్యాయ సమస్యలపై ప్రశ్నించే అవకాశం రమాప్రభ గెలుపు ద్వారా సాధ్యమవుతుందని అన్నారు. అభ్యర్థి రమాప్రభ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో సంపూర్ణ విద్యాభివృద్ధిపై ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల అక్షరాస్యత 46 శాతం మాత్రమే ఉందన్నారు. ప్రభుత్వాల తీరుతో గిరిజన యువతకు జీవన, ఉపాధి అవకాశాలు సన్నగిల్లాయని చెప్పారు. విద్యాలయాల్లో సదుపాయాలు కరువయ్యాయన్నారు. డోలీల్లో రోగులను ఆసుపత్రులకు తీసుకువెళ్లే పరిస్థితి నేటికీ ఉండటం ప్రభుత్వాల నిర్లక్ష్యానికి తార్కాణమన్నారు. గిరిజన ఉపాధ్యాయుల, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి తాను కృషి చేస్తానన్నారు.










