ప్రజాశక్తి-బాపట్ల రూరల్: ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేస్తున్న పోరాటాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తే పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఉద్యోగ సంఘాల నాయకులు అన్నారు. జూన్ 8న గుంటూరులో ఏపిజెఏసి అమరావతి ఆధ్వర్యంలో చేపట్టదలచిన నాలుగో ప్రాంతీయ సదస్సును జయప్రదం చేయాలని బాపట్ల కలెక్టర్ కార్యాలయం వద్ద పోస్టర్, కరపత్రాలను రిలీజ్ చేశారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు సృష్టిస్తున్నా 85 రోజులుగా గాంధేయ పద్ధతిలో చేస్తున్న పోరాటాలు కనిపించకపోతే జూన్ 10న రాష్ట్ర కార్యవర్గంలో చర్చించి భవిష్యత్ కార్యక్రమాలన్ని ఏఐటియుసి, సిఐటియు కార్మిక సంఘాల తో కలిసి తప్పనిసరి పరిస్థితులలో ప్రత్యక్ష కార్యాచరణకు పూనుకోకతప్పదని, దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని ఏపిజేఏసి అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, బాపట్ల జిల్లా జెఏసి చైర్మన్ సిహెచ్ సురేష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 85 రోజుల ఉద్యమం వలన ఉద్యోగులకు రావాల్సిన బకాయిలలో సూమారు రూ.6,000 కోట్లు సాధించుకున్నాం. కారుణ్య నియామాకాలు సాదించు కున్నాం, ఆర్టీసి ఉద్యోగుల సమస్యలు కొన్ని పరిష్కరించు కున్నాం. కొత్త జిల్లాల్లో హెచ్‌ఆర్‌ఏ పెంపుదల, కొంతమందికి టిఏలు, కొన్ని డిపార్టుమెంటు ఉద్యోగులకు ఎర్న్‌డ్ లీవ్‌ల డబ్బులు పడుతున్నాయని అన్నారు. సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం వాడుకున్న డబ్బులు రూ.2,400 కోట్లు ఇప్పించుకోగలిగాం.. ఇదంతా ఈ 85 రోజుల ఉద్యమ ఫలితంగానే సాధించుకోగలిగామని ఆయన తెలిపారు. ఇంకా ఉద్యోగులకు రావల్సిన వాటిలో పిఆర్‌సి, డిఏ బకాలు, పెండింగు డిఏలలో ఒకటి ప్రకటించినప్పటికీ ఇంకా రెండు డిఏలు రావాల్సి ఉందని, వీటితో పాటు రెవెన్యూ, ఆర్టీసి, మున్సిపల్, గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్ సోర్శింగు ఉద్యోగుల సమస్యలు ఇంకా వివిధ డిపార్టు ఉద్యోగులకు సంబంధించి న సమస్యలు పరిష్కారం కావల్సి ఉందన్నారు. ఏది ఏమైనప్పటికీ సిఎస్‌కు ఇచ్చిన 50 పేజీల మెమోరాండంలో సమస్యలు పరిష్కారంపై స్పష్టత ఇచ్చేంతవరకు ఉద్యమం కొనసాగిస్తామని ఎన్‌టీఆర్ జిల్లా సెక్రటరీ జెనరల్ ఎం రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపిజేఏసి అమరావతి బాపట్ల జిల్లా చైర్మన్ సిహెచ్ సురేష్ బాబు, సెక్రెటరీ జనరల్ టి రజనీకాంత్, విఆర్‌వో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఏ సాంబశివరావు, స్టేట్ క్లాస్ 4 ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ మల్లేశ్వరరావు, జిల్లా జేఏసి కో చైర్మన్ వై శ్రీనివాసరావు, కో ఆపరేటివ్ నాయకులు మురళి మోహన్‌రెడ్డి, రెవెన్యూ సంఘం జిల్లా కోశాధికారి బి ఓంకార్, డివిజన్ నాయకులు చంద్రశేఖర్, పి సురేష్‌బాబు, కె లక్ష్మీనారాయణ తదితర నాయకులతో పాటు, ఉద్యోగులు పాల్గొన్నారు.










