
జెసికి విఆర్‌ఎల సంఘం నేతలు వినతి
ప్రజాశక్తి - భీమవరం
విఆర్‌ఎల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని విఆర్‌ఎల సంఘం జిల్లా అధ్యక్షులు బి.గణేష్, గౌరవాధ్యక్షులు ఎం.ఆంజనేయులు అన్నారు. ఈనెల 25న విఆర్‌ఎలు చేపట్టిన జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి అనుమతిచ్చి విజయవాడ చేరుకునేసరికి అనుమతి లేదంటూ అరెస్టులు చేసి నిర్బంధించడాన్ని నిరసిస్తూ కలెక్టరేట్ వద్ద బుధవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ రామ్‌సుందర్ రెడ్డికి సంఘం నేతలు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విఆర్‌ఎల సంఘం నేతలు గణేష్, ఆంజనేయులు మాట్లాడారు. ప్రభుత్వం విఆర్‌ఎలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన డిఎ కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. విఆర్‌ఎల పట్ల ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో స్పష్టం చేసిందన్నారు. ఎన్నికల్లో ఓట్ల కోసం నోటికొచ్చిన వాగ్దానాలు చేసి అధికారం చేపట్టాక నాలుక కర్చుకోవడం పాలకులకు అలవాటుగా మారిందన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా ఈ విధానాన్ని అవలంబించడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో విఆర్‌ఎల సంఘం భీమవరం డివిజన్ ఉపాధ్యక్షులు సుబ్బారావు, శ్రీకాంత్, మాణిక్యాలరావు, జాన్ మోషే, నాగేశ్వరరావు, సుబ్బారావు పాల్గొన్నారు.